Wednesday 2 November 2016

తరియించే...నా జన్మా...

ఓం శ్రీ సాయిరాం

తరియంచే నా జన్మ

తేది: 20-01-2016.

పల్లవి :

సాయిరాముడే ఆది గురువని వివరించె నా రచన
పలుకులేలనో పల్లవించె నా భావమంతయూ తెలుప
మా కంటికి రెప్పవలే మా ఇంటను జ్యోతివైనా
సాయి...యిీ...యిీ...యిీ...యిీ...యిీ...యిీ
||సాయిరాముడే||

చరణం : 1   
నాలోని రూపమా నను కన్న దైవమా
మనసార కొలిచేను నిన్ను
ఈ జన్మయైన మరే జన్మమైనా
నీవేగ నా కన్న తల్లీ
కష్టాలు కన్నీళ్ళ సుడిగుండమందు
వెలలేని నీ ప్రేమ పంచి
నా తొలి రోదనలో మది వేదన రాగముగా
నా మది కోవెలలో ఒక దేవత రూపముగా
కొలువయ్యే మరొ బ్రహ్మ...
 ||సాయిరాముడే||

 చరణం : 2
ఏనాటి బంధమో ఏ జన్మ ఋణమో
ఈనాటి నా కన్న తండ్రీ
కాయమ్ము తనదిగా జ్ఞానమ్ము నిచ్చి
నా జీవన గమ్యాన్ని చూపే
బ్రతుకింత బరువైన బరియించి నన్ను
ఎనలేని ఓదార్పు నిచ్చి
కరిగిన మైనముగా మాకు వెలుగును చూపెడుతూ
వాడిన హృదయాలలో చిరుదివ్వెను వెలిగించే
ఇది తీరే ఋణమేనా...
||సాయిరాముడే||

చరణం : 3
కని పెంచు ప్రేమను కలిగించి నాకు 
కనుముందు లేవేల స్వామి
పలుమార్లు తలచినా పరికించి నన్ను
నీ లీల చూపేవు దేవా
కలలాంటి జీవితం కలమందు నిలిపి
మలిచావు ఈనాటి కవిగా
చీకటి బాపితివి...వేకువ చూపితివి
వేసిన అడుగులకు...ఊతము నిచ్చితివి
తరియించే నా జన్మా...
||సాయిరాముడే||


గమనిక:   ఈ పాటను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు భక్తితో సమర్పిస్తూ నా కన్న తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ రెడ్లం నాగమణి రాజగోపాలరావు పుణ్యదంపతులకు ప్రేమతో అంకితం.

 

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు.