Thursday 5 July 2018

వెన్నెల గీతం

ఓం శ్రీ సాయిరాం

 వెన్నెల గీతం


పల్లవి:

సరదాకని నేనెపుడో వెన్నెల్లో కూర్చుంటే 
చిరునవ్వును విసిరే నెలవంక
మేఘాలను దాగేస్తూ దోబూచి ఆడేస్తూ
నా మనసును దోచే నెలవంక

||సరదాకని నేనెపుడో||

చరణం:1

ఒద్దంటే వినకుండా మరి నావైపే వస్తుంటే
నా గుండెకు వేగం పెరిగి పరుగెడుతుంటే
ఏవేవో వెచ్చని ఊహలు నాలో రగిలిస్తుంటే
నా వయసుకు రెక్కలు వచ్చి ఎగిరేస్తుంటే
చిత్రంగా సావాసం అందాల ప్రియ నేస్తం
నా తోటి చెలిమిని చేసిందా...

||సరదాకని నేనెపుడో||

చరణం:2

చుక్కల కను రెప్పలు విప్పిన చీకటినే చూస్తుంటే
నా కంటికి మిణుగురు గుంపుగ తోచేస్తుంటే
నడిరేయి నాట్యం చేస్తూ నదిలోపల దాగుంటే 
కొలనంతా కలువల కన్నెలు కవ్విస్తుంటే
పసిపాపగ నా మనసు పవళించెను పొన్నలపై
నెలరాజే నిద్దురపుచ్చంగా...

||సరదాకని నేనెపుడో||

రచన 
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Thursday 26 April 2018

ప్రణయ గీతం


ఓం శ్రీ సాయిరాం

ప్రణయ గీతం





పల్లవి:

కొరకొర చూపులు కొంటెతనంగా రారమ్మని పిలిచాయి
మిలమిల మెరిసే పెదవులు ఏదో ఇవ్వాలని పలికాయి

అను పల్లవి:

గుండెనే గుచ్చేయకే నీ చూపు విసిరేసి
ఆశనే రేకించకే అధరాలు ముడిచేసి
ఏనాడు చూడని అందం ఈనాడే ఎదురౌతుంటే
దివిలోని తారకలన్నీ కనురెప్పన వెలిగేస్తుంటే
అవునో కాదనో మతిపోయిందీక్షణం
||కొరకొర చూపులు||
చరణం:1

చెలియ చెంపలో సిగ్గు మొగ్గలే అందమేమొ బహుశ
వెన్నెలందుకే చిన్నబోయెనే నిన్ను చూసి తెలుసా
సోగ కన్నులా సొగసులతో హృదయవీణనే మీటావే
గోరువెచ్చని ఊసులతో నన్ను నీవు మరిపించావే
ఓ బ్రహ్మా... ఇది నీ మాయా... ఈ గుమ్మా...
సిరి చందన గంధపు ప్రేమ సుగంధం వెదజల్లేనురా
విధి నీ లీలేనురా...


||కొరకొర చూపులు||
చరణం:2

మగువ చూపులో మనసు ఎక్కడో తప్పిపోయెనేమో
వెదకి చూడగా ప్రణయ గీతమై నిన్ను చేరెనేమో
కంటికెదురుగా నువ్వుంటే గుండెకెందుకీ పరుగంటా
జోరు వయసులో ప్రతిజంట జారిపడ్డదే ప్రేమంటా
ఓ మనసా సరదా పడవే... నీవింక...
ఆ చక్కని నెచ్చెలి చెంతకు చేరే వంతెన ప్రేమని...
ఇది నిజమని నమ్మవే...
||కొరకొర చూపులు||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Monday 2 April 2018

చంద్రమౌళి శతకం

ఓం శ్రీ సాయిరాం

చంద్రమౌళి శతకం 

ఆటవెలది పద్యాలు


1. ఘాటు తగ్గకుండ గుండెల్లొ గుచ్చినా
   చక్కదిద్ద గలదు చిన్న మాట
   పెద్దలిచ్చి పోయె పదునైన యీటెను
   చంద్రమౌళి మాట చదువ రండు

2. కత్తి బట్ట బోకు కరము విసరబోకు
    సూటి పోటి మాట చేటు దెచ్చు
    మాట గుచ్చుకున్న మానని గాయమౌ
    చంద్రమౌళి మాట చదువ రండు

3. కడుపు పండగానె కడుసంబరపడేరు
    పడతియందు నుండ పడదు మీకు
    జనని లేకయున్న జనులేరి జగమేది
    చంద్రమౌళి మాట చదువ రండు

4. చేయు సాయమింత చెప్పేది కొండంత
    చెప్పు కొందు రేమొ మెప్పుగోరి
    ఫలము లిచ్చు తరువు ఫలితంబు నడుగునా
    చంద్రమౌళి మాట చదువ రండు

5. గతము గాయమనుచు గతియె లేదననుచు
    తలచి తలచి వగచ తగదు నీకు
    శిలలు గాయ పడక శిల్పమెట్లౌనురా
    చంద్రమౌళి మాట చదువ రండు

6. గురువు మాట లెరువు గుణము తేట తెలుపు
    ఎరుగు శిష్యు లిప్పు డెంత మంది
    అమ్మ నెరుగ కున్న యాబ్రహ్మ నెరుగునా 
    చంద్రమౌళి మాట చదువ రండు

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 13 February 2018

విరహ గీతం

ఓం శ్రీ సాయిరాం

విరహ గీతం


పల్లవి:

చిన్నారి సిరిమల్లీ ఎందుదొ జాబిల్లీ
తనజాడ తెలిసే మార్గం చూపించవే
ఇన్నినాళ్ళు ఊరుకుంది వయసు
మౌనమింక సాగదంది మనసు
హెచ్చరికలంపె నాకు ఇపుడు
దారిచెప్పి నీవు సాయపడరావా
నెలరాజా... రాజా... రాజా...
||చిన్నారి సిరిమల్లీ||

చరణం:1

తన్నుతానుగా అందిరాదుగా మనకై చంద్రమా
వద్దచేరి నా విరహవేదన నీవే తెలుపుమా
అదిరి పోవునో బెదిరి పోవునో నిన్నే చూడగా
కుసుమ కోమలి కుశల మడిగి నా మనసే చెప్పుమా
శ్వాసలో శ్వాసనై చేరే వేళకై
ఆశగా ఆమెకై వేచున్నానని
విన్నపాలు విని నన్ను చేరమని విన్నవించి రావా
||చిన్నారి సిరిమల్లీ||

చరణం:2

సగము తానుగా సగము నేనుగా కలిసేదెప్పుడో
జీవితాన నా చేయిపట్టుకొని నడిచేదెెప్పుడో
పాలు నీళ్ళలా పదము భావమై కలిసేదెప్పుడో
అడుగు అడుగునా తోడు నీడగా నడిచేదెప్పుడో
మనసులో మనసువై చేరే నా చెలి
బ్రతుకులో జంటగా తోడుంటావని
తెలుగు భాషలో తీర్చి కూర్చినా తీయనైన లేఖ
||చిన్నారి సిరిమల్లీ||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు