Friday 14 February 2020

ఇకనైన మేలుకోరా

ఓం శ్రీ సాయిరాం 

ఇకనైన మేలుకోరా

పల్లవి

మనుషులంటే... విలువలేదు

ఏమిటీ లోకము...

మంచి వీడి చెడును చేరి 

చీకటైపోయెను... 

ముందడుగు వేస్తె నుయ్యి...

వెనకడుగు వేస్తె గొయ్యి...

ఎటువైపు చూడు మటుమాయలేను

ఇకనైన మేలుకోరా...

|| మనుషులంటే||

చరణం 1 

మేకతోలునే కప్పుకొని 

పులిని లోపలే దాచుకొని 

మంచితనపు టోపీ వేసి

నిలువు దోపిడీ చేస్తారు

మాటతోనె యేమారుస్తూ 

మంచి మనిషిలా నటియిస్తూ 

గాలి మేడ పైకెక్కించి 

మట్టిలోకి తోసేస్తారు

మునుపటిలా మనుషులు లేరిపుడు

అసలుందో లేదో మనసిపుడు

మర మనుషులైతె మమకారమింక

వసివాడి రాలిపోదా...   

|| మనుషులంటే||

చరణం 2 

వాడుకునే ఒక వస్తువుగా

మనిషిని భావన చేస్తారు

అవసరాలనే తీర్చుకుని

అవతల పారేస్తారు

అభిమానం మనిషికి ఆభరణం

అది వున్న వారికే అవమానం

సమయాన్ని బట్టి సమయోచితంగ

అడుగేస్తు సాగిపోరా

|| మనుషులంటే||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Saturday 16 November 2019

జీవితానికి రెండు సూక్తులు

ఓం శ్రీ సాయిరాం
జీవితానికి రెండు సూక్తులు


కొన్ని అనుభవాలు 
కొన్ని పాఠాలు 
మరికొన్ని మాటలు 
ఇవే మనిషి జీవితానికి స్పూర్తినిచ్చే దాతలు

***

విన్న నిజం కన్నా పొందిన అనుభవం గొప్పది 
కొన్న చదువు కన్నా నేర్చుకున్న పాఠం గొప్పది
మనసును తాకే ప్రతి మంచి మాట మార్గాన్ని చూపే బాటౌతుంది.


రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 8 October 2019

అందమైన కందాలు

ఓం శ్రీ సాయిరాం
అందమైన కందాలు 



కం. వందనము తెలుగు తల్లీ 
అందరమూ జేతులెత్తి దండము సేయన్
కందమునేమని చెప్పుదు
సుందరముగ పాదమమరె సొగసుల తోడన్


కం. జయము జయము గురువులకును
దయతో భారతి వచింప పలికిన కందం
లయ జేతును మీ తోడుగ
నయమే నే  మేలుకొంటి నలుగురితోడన్


కం. కలగా మిగిలిన కందము
జల జలమని వలచి వచ్చి ఝరిలో జేరెన్
ఇలపై నిలవని మనసున
తొలగాలిక తెరలమబ్బు తరుణంబిదియే

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Monday 7 October 2019

కంద పద్యం

ఓం శ్రీ సాయిరాం

కంద పద్యం



కం. వచ్చిన స్వాతంత్ర్యమ్మును 
ముచ్చటగా జరుపుకొనిరి పుడమిని జనులున్
తెచ్చిన వీరుల గాధలు
మెచ్చుట గాదిది భవితను మేల్కోవలెనన్

   

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 30 July 2019

తొలకరింతలా పలకరించు

ఓం శ్రీ సాయిరాం

తొలకరింతలా పలకరించు




మేఘమా మేఘమా మెరవకే అలా
గాలిలో అలా సాగితే ఎలా
గంగనే నింగిలో దాచుకోకలా
రాళ్ళసీమనే మరిచితే ఎలా
రైతు కంటనీరు పెట్టనీకలా
కారుమబ్బులా ముసిరితే ఎలా
మండుటెండల ఎండిపోయె ఇల
దుక్కిదున్ని ఏతమెత్తి
విత్తునాటిన పల్లెసీమ
రెప్పవాల్చక ఎదురు చూస్తే
పట్టలేదని మరలిపోతివా
నేల కొంగుచాచి అడుగలేదనా
నింగి అంచుదాక ఎగిరిపోతివి
ఎందుకమ్మా ఇంత క్షామం
ఎవరి మీద ఈ ప్రకోపం
నిన్ను నమ్మిన బిడ్డ మీద
నన్ను కన్న గడ్డ మీద
అలక మాని ఇలకు చేరు
వాన నవ్వులా నేల రాలు
తొలకరింతలా పలకరించు

రచన
మీ రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

నీలో ఎందుకింత సందిగ్ధం

ఓం శ్రీ సాయిరాం

నీలో ఎందుకింత సందిగ్ధం


నీలో ఎందుకింత సందిగ్ధం
వదలదు ఏమిటింత గ్రహచారం
ఏదో పొరపాటని అనుకుంటే
కాలం ఆగిపోదు నీకోసం
ఏమీ ప్రయోజనం లేకున్నా
కెరటం ఎగసి ఎగసి పడలేదా
సూర్యుడు ఆదమరచి నిదురిస్తే
వేకువ జాడలేదు మనకోసం
భూమి బ్రమించడం ఆగిందా
లోకం తల్లడిల్లి పోతుంది
గాలి తీసుకుంటె విశ్రాంతి
జీవికి నూకలింక చెల్లేను
పారే ఏరు కదలలేకుంటే
ప్రాణి మనుగడింక సాగేనా
నీలో అగ్గిపుల్ల వెలిగిస్తే
నడిచే దారి నీకు కనిపించు
ప్రాణం నిలిచినంత వరకేగా
గమ్యం చేరుదాక పోరాటం
ఏమీ ప్రయోజనం లేకుండా
ఊరికె ఇచ్చిపోకు నీ ప్రాణం

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Monday 15 July 2019

మది ఊయలై కదలాడెను

ఓం శ్రీ సాయిరాం

మది ఊయలై కదలాడెను




పల్లవి:

చిగురాకులా చిరుగాలికి మది ఊయలై కదలాడెను
తొలి చినుకులా ఈ నేలకి ఒక దేవతే దిగివచ్చెను
తనువార దరిచేరిందని మహుమాటమే పడవద్దని
తొలిసారిగ యదలో ఇలా తన ప్రేమ కురిపించిందని

||చిగురాకులా||


చరణం:1

తామరాకు ఒంటిరంగు ఆమని ప్రేమని
చైత్రమాసం అందుకోసం చక్కగా పూయని
తీయనైన పాటలెన్నో కోయిలా పాడాగా
కొమ్మలన్నీ గాలితాకి లీలగా ఆడగా
సెలయేటి గలగల నవ్వులా నను చేరుకున్నా నువ్వులా
ఆ అందమే ఆనందమై నా గుండెనే చేరిందని

||చిగురాకులా||

 

చరణం:2

రెండు మనసుల కలయికేలే ప్రకృతి పురుషుడు
ఇంత జగము వారి ప్రేమకు సాక్ష్యము
సూర్యచంద్రుల కలయికేలే రోజులు ఋతువులు
కాలమేలే వారి ప్రేమకు సాక్ష్యము
జగమంత నిండిన ప్రేమయే మన ప్రేమకు శ్రీకారము
నా గానము నా గీతము ఈ ప్రేమకే అంకితమని

||చిగురాకులా||


రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు