Wednesday 15 May 2019

ఉదయించిన కిరణాన్ని


ఓం శ్రీ సాయిరాం

ఉదయించిన కిరణాన్ని


కన్నాను నే కలలెన్నో
నెరవేర్చే దారులలో అడుగడుగు తడబడుతూ
నిరుపేదను స్థితిలో నేను తలవంచని గగనాన్ని
నిదురించిన స్వప్నం కోసం ఉదయించిన కిరణాన్ని
 ***
జీవిత మధనం చేస్తూ కష్టాలను చవిచూసేవురా
గుండెకు ధైర్యం పోస్తూ మరణాన్నే గెలుపొందేవురా
బ్రతుకంటేనే పెను సవాళ్ళు... పోరాడి గెలుపొందరా...
***
కాటుక చీకటి లోకం ఓ కోడై కూతలు కూయగా
కంటికి నిద్దుర లేక నడిరేయంతా వగచేవురా
ఆ క్షణాన శిశిరమౌతున్నా... చైత్రాలు వికశింపవా
 ***
ఆటూ పోటుల నడుమ పడి లేచే కెరటం జీవితం
కాలం నెమరేస్తున్నా అణువణువు పొందిన జ్ఞాపకం
ఓటమెదురైన గెలుపునీదైన నేర్చుకోవాలి పాఠాలురా
 ***
గెలిచే పిలుపు నిన్ను కనులారా చూడాలందిరా
ఓటమి కౌగిలి వీడి నీ ఉనికిని చాటు ముందరా
ఉదయ కిరణాన్ని కనగ ఇకనైన నీ దారి మళ్ళించరా 
 ***
దూరంగుందనుకుంటే జడివానే నేలను చేరునా
భారంగుందనుకుంటే ఈ మన్నే నిన్ను మోయునా
అలసిపోతున్నా ఆశ బతికున్నా దూర భారాలు కడతేరవా
 ***
జీవించాలని ఉందా ప్రతి నిత్యం పోరాడాలిరా
ఆశల తీరం వెంట నీ అడుగులు వేస్తూ సోదరా
పడిలేస్తున్నా... పరుగుతీస్తున్నా... విజయాల తీరానికే

రచన
చంద్రమౌళి రెడ్లం