Sunday 5 November 2017

బొమ్మ బొరుసు

ఓం శ్రీ సాయిరాం

బొమ్మ బొరుసు (కవిత)



నిజానికి అవి బొమ్మ బొరుసులు
బ్రతుకు నాణానికి...
అయినా అవి జీవితాన్ని నడిపిస్తాయి
నాణెం లోకాన్ని నడిపించినట్లు
***
నిజానికి అవి బొమ్మ బొరుసులే...కానీ
కంటికి కనిపించని వెలుగు నీడలు
జీవితానికి ఎత్తుపల్లాలు
కాల చక్రంతో కలిసినడిచినా
ఒకదానికొకటి ఎదురుపడవు
ఎందుకంటే అవి పాదాల్లాంటివి
పక్కపక్కనే నిలబడ్డా
ఒకదాని వెనకే ఒకటి
రేయింబవళ్ళలా జతపడవు కానీ
ఏ ఒక్కటి లేకపోయినా బ్రతుకు తెలవారదు
*** 
నిజానికి అవి బొమ్మ బొరుసులే...అయినా
అమావాస్య చంద్రుడులా ఒకటి
వసంత భానుడిలా మరొకటి
వంచించినా...వరించినా
నేర్పేది పాఠాన్నే...దిద్దేది జీవితాన్నే
అందుకే అవి నాణానికి బొమ్మాబొరుసులు
బ్రతుకులో కష్టసుఖాలు
అవే మన జీవన ప్రమాణాలు
*** 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Monday 23 October 2017

మదిగీతం

ఓం శ్రీ సాయిరాం

మదిగీతం

పల్లవి
మనసే కాగితం ప్రేమే కారకం
నీతోడై నడవాలి నా పాళీ
ఇది మదికావ్యం మధుగీతం కావాలి
మౌనంగా ఎదలోనే సాగాలి

చరణం:1
నాలో స్పందన నీవైతే
ఉదయించే ఊహలకు ఊపిరివే
ఊగించేవిలా మది ఉయ్యాలలా
నిన్నే వలచి నన్నే మరచి మురిసేనే కళా

చరణం:2
ఎదుటే లేవని తెలిసినా
నీకోసం ఆరాటం ఆగనిదే
మదిలో రూపమా మెదిలే భావమా
నా పదమందు ఒదిగే భావ కవితా సుందరీ 

గమనిక: ఈ గీతం ఆంధ్రజ్యోతి నవకలం శీర్షికలో ప్రచురించబడినది.

రచన 
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Thursday 5 October 2017

తెలవారని రేయిని

ఓం శ్రీ సాయిరాం

తెలవారని రేయిని (కవిత)



తెలవారని రేయిని
చిగురంత ఆశ మొలకెత్తి నాలో 
పెనుచీకటంతా పొగమంచులాగ కరిగిందని
తెలవారని రేయిని
***
అరుణోదయాన అమవాస కళ్ళు
తెరతీసి వెలుగే చూడనీ
చంద్రోదయాన నా వాలు కళ్ళు
వెన్నెలతొ వెలుగే నిండనీ
ఆకాశమంత ఆశున్న చాలు 
ఏ చీకటైనా కరిగేనని
తెలవారని రేయిని
***
గుండెల్లొ మంట చల్లార్చుతున్న 
కన్నీటి పరుగు కలకాలం ఉండిపోలేదని
ఇన్నాళ్ళ వ్యధలు కాలాన కరిగి
ఈనాటితో వీడిపోవాలని
మునుపంటి కింద అధరాల బాధ
చిరకాలం నవ్వుకోవాలని
తెలవారని రేయిని
***
అవరోధమున్న నది ఆగుతుందా
ముంచెత్తి వరదై పొంగదా
వెనకడుగు పడిన అల ఊరుకుందా
అలుపంటురాక సాగదా
ఏ గమ్యమైనా నిను చేరుతుందా
వెంటపడి అడుగే వేయక
పరదాలు తీసి పలుకునా
దరిచేరు దారే చూపునా
తెలవారని రేయిని
***
పెనుముప్పు పొంచివున్న
నిను ముంచుకొచ్చిన
చెరగని చిరునవ్వే కదా ఆశన్నది
నడిరేయి ముంచిన
శిశిరాన్ని తుంచిన
బెదరని ధైర్యమే కదా ఆశన్నది
ఏనాడు విడువకు ఆశను నువ్వు
పెదవుల నవ్వులను
చిగురించిన ధైర్యం ఊపిరి తనకు
మరువకు కడవరకు
నమ్మకం నావగా ఆశయం శ్వాసగా
సాగిపో నేస్తమా
తెలవారని రేయిని 
 ***
ఈ కవిత అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడినది ఈ కింది లింకులో చూడగలరు 
http://www.acchamgatelugu.com/2017/07/tellavarani-reyini.html 
రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

మనసుపాట మనసా వినవా

ఓం శ్రీ సాయిరాం

మనసుపాట మనసా వినవా



పల్లవి

వేల వేల వందనాలు నీకు 
ఓసి మనసా మాటే వినవా
తోచు మాటలన్ని పాటకూర్చనీవ 
మనసు పాట మనసా వినవా

అనుపల్లవి
ఊహలతో కలలకు రెక్కలు వేయకుమా
చెరిగినవో అతకవు ఆశలు రెేపకుమా
కలను కరిగేవుమా నిజం విను నా మాటలు 
||వేల వేల||
చరణం 1

నిజము మరిచేలా నిలువరించే 
స్వప్నలోకం తలపులే మూయనీ
నిదురలో ఉన్నా నీడలాగే 
వెంటసాగే కలతలే మాయనీ
జ్ఞాపకం నాటిది ఆశయం నేటిది
అనుకుంటూ తనకంటూ మార్గం వేయని
||వేల వేల||
చరణం 2

చిగురు తొడిగేలా చీకటింట
కంటిపాప వెలుతురే చూడని
స్థిరముగా ఉన్న మనసులోకి
మర్గమపుడు అడుగులే వేయని
జీవితం ఆశగా అనుభవం శ్వాసగా
దరిజేర్చే దారులుగా గమ్యం చేరని
||వేల వేల||   
ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడినది ఈ కింది లింకులో చూడగలరు
http://www.acchamgatelugu.com/2017/06/manasu-pata-vinava.html

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 

Sunday 9 July 2017

మనసు మధనం

ఓం శ్రీ సాయిరాం

మనసు మధనం


అంతరంగం ఆలోచనలో మునిగి
మనసును మధించడం మొదలుపెట్టింది
ఊహల వలయాలు సుడులు తిరుగుతూ
లోతైన అన్వేషణ చేస్తున్నాయి
ఘాఢ నిశ్శబ్ధంలో
తొణికిసలాడుతున్న మనసును
చిలుకుతున్న శబ్ధంలోంచి
అనుబంధాలు బయటపడి
ఆత్మీయ సంకెళ్ళు వేసాయి
మమతానురాగాల కటకటాల వెనక్కి
నన్ను నెట్టాలని
అయినా మధనం ఆగలేదు
స్వప్నసుందరి ప్రత్యక్షమైంది
ప్రణయ కలశంతో
ఆమె అధరామృతాన్ని
నాపై ఒలకబోయాలని
వలపు చిచ్చురగిల్చి
మోహంతో నన్ను దహించాలని
అయినా మధనం ఆగలేదు
అపాయాలు, అన్యాయాలు
ద్వేషాలు, మోసాలు
ఈసడింపులు, ఛీత్కారాలు
నిరుద్యోగం, దారిద్ర్యం
హాహాకారాలు చేస్తూ
మనసును ముసురుకున్నాయి
అయినా మధనం ఆగలేదు
ముసిరిన చీకట్లు మసకబారాయి
తెల్లటి కాంతిపుంజాలు
అంతరంగంపై ప్రసరించి
హృదయ కవాటం తెరుచుకుంది
అక్షర కలశం బయటపడి
ఆ వెలుగు రేఖల తాకిడికి
నాడులన్నీ జాగృతం చెంది
వెన్నుపాములో వణుకుపుట్టింది
మస్తిష్కాన్ని ప్రేరేపించింది
ఉదయించిందొక వాణి
నా మనోవీణా తంత్రుల్ని మీటి మేల్కొల్పుతూ
చేతి వేళ్ళు కదులుతున్నాయి
కాగితంపై నుగ్గులు పెడుతూ
ఏవో దిద్దుకుంటున్నాయి
గీతలతో దారులు వేస్తూ
సమాసం చేస్తున్నాయి స్వభావానుసారం
సంధి చేస్తున్నాయి అటుకి ఇటుకి
అమరిపోతున్నాయి అక్షరాలు
లక్షణాన్ని బట్టి
రూపుదిద్దుకుంటున్నాయి పదాలు
భావాన్ని బట్టి
ఏరుకుంటున్నది కలం కావలసిన వాటిని
చేతి వేళ్ళ నున్నడుమ
పద భంగిమలతో నాట్యం చేస్తూ
అలంకారాలను అందిపుచ్చుకొంది భావం
అంతర్లీనంగా పురుడు పోసుకుని
స్వచ్ఛమైన కళ శ్రీకారం చుట్టుకొని
కవితా శిల్పం
కనుల ముందు సాక్షాత్కారమయింది

రచన
 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Sunday 2 July 2017

ఇదే మాకు పాళి అదే మా నివాళి (Dedicated To Dr.C.Narayana Reddy)

ఓం శ్రీ సాయిరాం

ఇదే మాకు పాళి అదే మా నివాళి



ఇదో ఇదో గీతము రచించె భావి భారతం
అదో అదో ప్రాభవం తరించె మాతృ భారతం

ఇదో ఇదో గీతము సినారె ఆత్మకంకితం
అదో అదో ప్రాభవం సినారె కల్పనామృతం

గజళ్ళ గమనానివన్నా గేయాల గానాలు విన్నా
కథా కావ్య సాహితి సినారె పాళి సంతకం

భువిలోని  వృత్తాంతమంతా విశ్వంభరాతత్వమన్నా
ప్రకృతే ప్రమాణం దానికి మనిషి జీవనానికి

జరిగే ఘోరాలు విన్నా జనజీవితానివన్నా
ప్రపంచ పదులు నేటికి సమాధానం వాటికి

కొరతెంత కనబడుతు వున్నా సరితూగు విధ్వాంశులున్నా
ఇంకా వెలితి తీరదు సినారె కవిత పారదు

సినారె తెలుగు సాహితి తరాల భవిత వారధి
విశాల భరత జాతికి వరాల వెలుగు సారధి

ఇదే మాకు పాళి అదే మా నివాళి 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Sunday 4 June 2017

ప్రేమ స్వరూపం(Embodiment of Love)

ఓం శ్రీ సాయిరాం

ప్రేమ స్వరూపం




సాయి అను నామము లేకున్న
కలము ఎటుల కదుల గలదు
భక్తి యను భావము లేకున్న
మదిని కవిత ఎటుల కలుగు
***
సత్యం యను వేరు లేకున్న
ధర్మవృక్ష మెటుల నిలువ గలదు
శాంతి యను స్థాపన లేకున్న
మతములెటుల ఒకటిగ చేరగలవు
***
అహింస యను ఆయుధమే లేకున్న
జీవమెటుల బ్రతుక గలదు
సేవ యను మార్గము లేకున్న
గర్వ మెటుల తొలగ గలదు
***
ప్రేమ యను రూపము లేకున్న
సాయి నెటుల ఎరుగ గలము 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Thursday 25 May 2017

నా కవిత



ఓం శ్రీ సాయిరాం

నా కవిత


నిశి కేళిని చీల్చునట్టి ఉషోదయము నాకవిత

శిసిరానికి సెలవు పలుకు వసంతమే నాకవిత

ఒడ్డుచేర అలసిపోని అలల ఘోష నాకవిత

వినువీధిని చూపు నిలిపి ఎదుగు మొక్క నాకవిత

మంచు తెరలు తీయునట్టి తొలికిరణం నాకవిత

పున్నమిలో చంద్రకిరణ ప్రకాశమే నాకవిత

ఆకాశపుటంచు కొలుచు కొలమానం నాకవిత

అలుపెరుగని పోరాటపు అక్షరమే నాకవిత

కవిత రాయు కలమునకు కలల భాష నాకవిత

రాయలేని భావాలకు రాజధాని నాకవిత

అక్షరాల లక్షణాన అమరిన పద్యంబై

శతాబ్ధాలు చెరిగిపోని తెలుగు పదము నాకవిత

సాహిత్యపు శిఖరాన వెలుగొందిన తెలుగు కవుల పాదధూళి నాకవిత

జనుల గుండె లయను తెలుపు జానపదము నాకవిత

సుతిమెత్తని భావనలా పరిమళించు సిరిమల్లే నాకవిత

ఆకురాల్చు కొమ్మలకు ఆయువిచ్చు నాకవిత

రెప్పవేయు మెలకువలో జ్ఞానదీప్తి నాకవిత

రెప్పవాల్చు చీకటిలో ఆత్మజ్యోతి నాకవిత

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

కావాలయ్య రామ నీ రాజ్యం

ఓం శ్రీ సాయిరాం
కావాలయ్య రామ నీ రాజ్యం


పల్లవి:
రామ రామ శ్రీరామ మమ్ము పాలించంగా రావేల
మళ్ళీ రామ నీ రాజ్యం మాకు కావాలయ్యా ఈవేళ
ముల్లోకాలు రక్షించే ఓ సీతరామ రావేల
కల్లోలాలు సృష్టించే ఈ మోసం ద్వేషం మమ్మే వీడి పోవాల
 ||రామ రామ శ్రీరామ||
చరణం:1
కన్న తల్లిదండ్రలే నేడు బరువని విడిచేరు కొందరు
కొనలేని మమకారమే వీడి స్వార్ధాన్ని ప్రేమించే బిడ్డలు 
వరమని పెంచినదే నేడు బరువని తుంచేరు కొందరు
పసిమొగ్గ విచ్చకనే సిరిమల్లె ప్రాణాలు తాసేరు మర మనుషులు
||రామ రామ శ్రీరామ||
చరణం:2
కన్నతల్లి పాలకే కరువని ఆకలి తీర్చిన తల్లిని
తనబిడ్డ సమమేనంటూ ఆ తల్లి పాలిచ్చి తన ప్రేమ పంచిన
ఈనాడు ఆ తల్లినే కడకు బలిపసువు చేసిరి పాపులు
చేసిన మేలు మరిచి ఆ తల్లి ప్రాణము తీసిరి యమ సుతులు
||రామ రామ శ్రీరామ||
చరణం:3
ఏమని చెప్పెదను నా దేశము పడుతున్న బాధను
ఈనాటి సీతమ్మను చెరబట్టే రక్కసి రావణులెందరో
మానము ప్రాణములే కొనిపోవ అబలల వేధింతురు
మొరవిని వెను వంటనే మము కాపాడ రావయ్య రణభీమ 
||రామ రామ శ్రీరామ||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 

Wednesday 24 May 2017

పుష్కరములు వచ్చె పుణ్యనదికి

ఓం శ్రీ సాయిరాం
పుష్కరములు వచ్చె పుణ్యనదికి
కృష్ణమ్మకు ఆటవెలది పద్యాలు



ఆటవెలదిలోన యమ్మ కృష్ణమ్మకు 
అచ్చ తెలుగు పద్యమమరినాది
తప్పులెన్ని యున్న తనయుని మన్నింపుమ
జనులగాచునట్టి జలధి కృష్ణ

రత్న గిరిని బుట్టి రాష్ట్రాలు కలుపుతూ
జీవ నదిగ మాకు జీవమిచ్చె
రత్న సిరులు గన్న మాయమ్మ కృష్మమ్మ
అందుకొనుము నాంధ్ర స్వాగతములు

పొద్దుపొడుచు వేళ పుణ్యనదిని జూడ
పుణ్యమొ ఇది ఏదొ జన్మ వరమొ
పురము పురము నందు పులకించె జనులెల్ల
పుష్కరముల వార్త చెవిని పడగ

వేద భూమి నుండి వుదయించి ప్రవహించి
ఊరువాడలన్ని ఒండ్రు జేర్చె
రైతు రాజ్యమేలు తెలుగు నాటనునేడు
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

కృష్ణ కృష్ణ యన్న కష్ణముదీర్చేవు
కోరు కున్న వరము కలుగ జేసి
కోరి వచ్చు వారి కోర్కెలు తీర్చంగ
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

శివుని పదము చెంత శ్రీశైలమందున
కనక దుర్గ ఒడిని యమరె కృష్ణ
ఎన్ని క్షేత్రములో ఎన్ని తీర్థములో
పదము చెంత జేరి పరవసించె

గమనిక- ఈ పద్యాలు కృష్ణపుష్కరాల  సందర్భంగా అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక వారు ప్రచురించిన కృష్ణపుష్కరాల ప్రత్యేక సంచికలో చోటుకల్పించుకున్నాయి.


రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Wednesday 26 April 2017

నా కనుల కొలనులను విరబూసిన కాంతివి నువ్వే

ఓం శ్రీ సాయిరాం

నా కనుల కొలనులను విరబూసిన కాంతివి నువ్వే



పల్లవి:
యదలో కొలువైనది ఎదుటే కరువైనది
మనసే వలపన్నది వయసే వినన్నది
తొలిప్రేమ ఆమని నను తాకి పోయెనే
నిజమేనా కలా ఇదీ...??
||యదలో||
చరణం:1
నడిరేయి ఉషోదమాయె తలచిననే ప్రియ సఖిని
తొలిప్రేమ సరాగమాయె హృదయములే జతకలిసి
నువు తాకిన నా హృదయం వర్షించే పదములను
విరిసిన ప్రతి అక్షరము అంకితమే నీ కొరకే
మిణుగురులై వెలుగొందే యద చీకటి మాటున
||యదలో||
చరణం:2
ఏనాటి ఋణానుబంధం మరువకుమా మనసులది
నిను చూసిన క్షణాన మౌనం మాటలనే గెలిచినది
తరగని చిరునవ్వులతో కురిపించే వెన్నెలవే
పున్నమికై చంద్రునిలా వేచేనే నీ కొరకే
నా కనుల కొలనులను విరబూసిన కాంతివి నువ్వే
||యదలో|| 

--రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Monday 24 April 2017

వదలక పదములు విడువక పట్టి

ఓం శ్రీ సాయిరాం

వదలక పదములు విడువక పట్టి

తేది 16-04-2017


పల్లవి:
నమ్మెను నామది నిరతము సాయిని 
వదలక పదములు విడువక పట్టి
||నమ్మెను నామది||
చరణం :1
చేసిన పాపమొ ఆ విధి శాపమొ
కాలము వేసెను గాలము
రక్కసి కర్కట రాచపుండుగ
ప్రాణము చేకొని పోవగ తలచి
||నమ్మెను నామది||
చరణం :2
జన్మకు బ్రహ్మలు తల్లిదండ్రులు
తీరెను ఋణమని తలచగ
వడి వడి నే నీ పదములు పట్టగ
కంటికి రెప్పగ కాపాడితివని
||నమ్మెను నామది||
చరణం :3 
తప్పితి మార్గము చేరగ గమ్యము
తడబడి అడుగుల వేయగ
బిర బిర రావ దారిచూపగ
కనులార్పక నే నీకై వేచి చూడగ
||నమ్మెను నామది||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Sunday 9 April 2017

MY HEART IS FILLED UP WITH HER LOVE

OM SRI SAIRAM

MY HEART IS FILLED UP WITH HER LOVE

DATE:08-01-2016


Last night after my supper before going to sleep i felt a psychological urge. Something is flowing from my heart to mind. But i don't know what it is,and i felt a sweet experience with it. Thinking about it i fell into sleep...

When i was in deep sleep the same feeling is repeated in me and my lips are blinking with smile. And my smile continued like this for some more time. And I'm experiencing the feel of it unconsciously in me,when i was in deep sleep. Is it blending of two souls...?? Or Unity of two hearts...!! I'm thinking like this in me and i enjoyed that moment.

When i recognized that the feel itself is my Love, then immediately my feel shattered and i woken up on my bed. Then i looked at the clock, it was quarter to twelve at midnight. I was very happy with smile on my face thinking about the situation, what i experienced with. On that time some words are followed one by one in my mind and written like this...

My Heart Is Filled Up With Sweetness of Love and which flows in to my mind without interrupt. When I'm hearing a bit of word about you. And I'm experiencing it with myself, Where you reside in me. And it's a new feeling to me which i never felt like this before. 

I never met a girl like you before. And what she did in me i don't know...But it is a great feeling, i can't express this in my words. But i can say that when and where we meet each other i don't know. But on that sec, on that min, on that hour, on that day with out my interference she will know it. Because my heart is filled up with her love FOR EVER END EVER.  

-- R.ChandraMouli
Palamaner.

Monday 3 April 2017

ఎదురు వచ్చె వాసంతం (Duet Song)

ఓం శ్రీ సాయిరాం

ఎదురు వచ్చె వాసంతం



పల్లవి:
తొలిచూపులోని ప్రేమ చిగురించె మనసులోన
నీ పెదవుల తీయని మాటలతో
నా పదములు నేర్పిన ప్రాసలతో
పదే పదే మదే ఇలా పలికెనే నా ప్రేమని ప్రణయ గీతమై
||తొలిచూపు||
అను పల్లవి:
గురి చూసి ప్రేమ నీవు గుండెల్లొ గుచ్చినావు
నీ కొర కొర చూపుల కన్నులతో
నా పెదవుల విరిసిన వెన్నెలతో
పదే పదే మదే ఇలా పలికెనే నా ప్రేమని హృదయ గీతమై
||గురి చూసి|| 
చరణ:1
ఆది మధ్యమున్న అంతమే లేనిదే మన ప్రేమ
అడుగులు వేసే ఆశలు తోడై
మనసు మనసు కలిసిన వేళ
వేల జన్మలైనా వీడలేని మన ప్రేమ
జంట కట్టుకుంది జీవితమందు
వెలుగుతున్న జ్యోతులు తోడై
||తొలిచూపు||
చరణం:2
ఆకురాల్చుకున్న ఆశలేని శిశిరాన్ని
చిగురులు నింపి చీకటి మాపి
ఎదురు వచ్చె వాసంతం
ఓర్పు నేర్పు వున్న ఓడిపోవు వనవాసం
ఒంటరివైనా పగలు రేయి
రోజు లేదు మనకోసం
||గురి చూసి||
చరణం:3
గతమునందు నాకు ఎదురు పడ్డ గాయాలు
అనుభవమనుచు సాగితి నేడు ఆశయాల సాధన కోసం
నా ఆశకు ఆయువు నీవు
నా రేపటి స్వప్నం నీవు
నా రెప్పల కౌగిలిలో నిన్ను దాచుకున్నాను
నా గుండెల్లో గూడు కట్టి నిన్ను కొలుచుకున్నాను  
||తొలిచూపు||

రచన

రెడ్లం చంద్రమౌళి

పలమనేరు

Friday 31 March 2017

చేయి అందించి మన ప్రేమ గెలిపించవ

ఓం శ్రీ సాయిరాం

చేయి అందించి మనప్రేమ గెలిపించవ



పల్లవి:
నీలాల నింగిలో చందమామ
నీ కొరకై వేచెను ఈ కలువ భామ
వెన్నెల వీడి నన్ను చేరగ రావ
కలిసెదము హృదయముల వ్యధలు తీర్చగ
||నీలాల||
చరణం:1
సఖా లాలించే పాటవై రావా
నన్ను మురిపించే మాటవైపోవా
నిన్ను చేరే క్షణం ప్రేమ పులకించదా
తీపి అధరాల రుచి చూడ భాగ్యమీయవా
||నీలాల||
చరణం:2
నీలి మేఘాల కబురంప లేద
కోటి రాగాల ఉయ్యాలలూగ
రేయి స్వప్నాలను నన్ను వేధించక
చేయి అందించి మనప్రేమ గెలిపించవ
||నీలాల||

--రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

 

కలనైన నిజమైన విడిపోనిది

ఓం శ్రీ సాయిరాం

కలనైన నిజమైన విడిపోనిది

తేది:14-08-2016


పల్లవి:
మా క్లాసులోన ఒక తుంటరీ చేసేను తెగ అల్లరి
విరజాజులన్నీ చిరినవ్వులై విరిసేను అధరాలపై
మదికీనాడు గుర్తొచ్చె ఇది ఎందుకో
అతనీనాడు జన్మించె మరియందుకే
మన స్నేహాలు విడిపోవు ఏనాటికి
మనమేనాడు కలిసేమొ ఒక చోటికి
చిరు ప్రాయంలో చిగురించినది 
అది కలనైన నిజమైన విడిపోనిది
||మా క్లాసులోన||
చరణం:1  
కులమేదైనా కలిసుంటాము
ఒకరికి ఒకరై తోడుగ నిలచి
కుదురుగ లేని తుంటరి వయసు
తమకంలోన చేసే గాయం
శ్రుతి మించి రాగాన పడుతుండగా
మన స్నేహాలు చెరిపేను ఆ గాయము
||మా క్లాసులోన||
చరణం:2
దూరాన్నున్నా విడిపోలేదు 
ముఖ పుస్తకమై దరిచేరాము
కాలంతోనే పరుగెడుతున్నా
ప్రతి విషయాన్ని పంచే మార్గం
ఈ మెయిల్ ట్విట్టరు వాట్సప్ లై
మన స్నేహాన్ని కలిపేను ఈనాడిలా 
||మా క్లాసులోన||

--రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Wednesday 29 March 2017

అతిశయోక్తి గాదే ఇది అమరప్రేమ


   ఓం శ్రీ సాయిరాం

అతిశయోక్తి గాదే ఇది అమరప్రేమ


 కవిత
కాలమాగలేదు కవిత చెప్పుదునన్న
మనసు మరువలేదు మదిని నిన్ను
శిలను చేసినావు చెలిమి వీడుచు నేడు
చీకటాయె బ్రతుకు చెలియ లేక
 ***
అడుగులేసి నాను అర్థమ్ము తెలియక
వలపు తలపులలోన తడిచి తడిచి
వలచినప్పుడు లేదు విరహతాపము నాడు
విడిచినప్పుడు ఏల తెలియ వలయు
 ***
విడువ మనసు రాక విడిచి నెంచితి నేను
యదను రేపిన గాయమణచలేక
వలపు ఊయలలూపి వేరు మనమున జేరి
అంతరంగము నేల అమరినావు
చెరపలేకపోతి చేరిన హృదయాన్ని
మనసు తలుపులు మూసి విడువలేక
 ***
ఉన్న వూరు గాదే విడువక వద్దునన్న
కన్న భూమి గాదే కలిసి వచ్చునన్న
కులము ఒక్కటి గాదే కుదిరి వచ్చెదనన్న
మతము ఒక్కటి యున్న మరియేది ఫలితము
 ***
విరహమోపలేక వెదకు చుండగ నిన్ను
వేరు వాకిలిదీసి వెడలిపోతివి గాదే
విడువలేక మనసు వెక్కి వెక్కి యేడ్చె
అతిసయోక్తి గాదే యిది యమరప్రేమ
 ***
                                                                                                        -- రెడ్లం చంద్రమౌళి
                                                                                       పలమనేరు