Thursday 25 May 2017

నా కవిత



ఓం శ్రీ సాయిరాం

నా కవిత


నిశి కేళిని చీల్చునట్టి ఉషోదయము నాకవిత

శిసిరానికి సెలవు పలుకు వసంతమే నాకవిత

ఒడ్డుచేర అలసిపోని అలల ఘోష నాకవిత

వినువీధిని చూపు నిలిపి ఎదుగు మొక్క నాకవిత

మంచు తెరలు తీయునట్టి తొలికిరణం నాకవిత

పున్నమిలో చంద్రకిరణ ప్రకాశమే నాకవిత

ఆకాశపుటంచు కొలుచు కొలమానం నాకవిత

అలుపెరుగని పోరాటపు అక్షరమే నాకవిత

కవిత రాయు కలమునకు కలల భాష నాకవిత

రాయలేని భావాలకు రాజధాని నాకవిత

అక్షరాల లక్షణాన అమరిన పద్యంబై

శతాబ్ధాలు చెరిగిపోని తెలుగు పదము నాకవిత

సాహిత్యపు శిఖరాన వెలుగొందిన తెలుగు కవుల పాదధూళి నాకవిత

జనుల గుండె లయను తెలుపు జానపదము నాకవిత

సుతిమెత్తని భావనలా పరిమళించు సిరిమల్లే నాకవిత

ఆకురాల్చు కొమ్మలకు ఆయువిచ్చు నాకవిత

రెప్పవేయు మెలకువలో జ్ఞానదీప్తి నాకవిత

రెప్పవాల్చు చీకటిలో ఆత్మజ్యోతి నాకవిత

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

కావాలయ్య రామ నీ రాజ్యం

ఓం శ్రీ సాయిరాం
కావాలయ్య రామ నీ రాజ్యం


పల్లవి:
రామ రామ శ్రీరామ మమ్ము పాలించంగా రావేల
మళ్ళీ రామ నీ రాజ్యం మాకు కావాలయ్యా ఈవేళ
ముల్లోకాలు రక్షించే ఓ సీతరామ రావేల
కల్లోలాలు సృష్టించే ఈ మోసం ద్వేషం మమ్మే వీడి పోవాల
 ||రామ రామ శ్రీరామ||
చరణం:1
కన్న తల్లిదండ్రలే నేడు బరువని విడిచేరు కొందరు
కొనలేని మమకారమే వీడి స్వార్ధాన్ని ప్రేమించే బిడ్డలు 
వరమని పెంచినదే నేడు బరువని తుంచేరు కొందరు
పసిమొగ్గ విచ్చకనే సిరిమల్లె ప్రాణాలు తాసేరు మర మనుషులు
||రామ రామ శ్రీరామ||
చరణం:2
కన్నతల్లి పాలకే కరువని ఆకలి తీర్చిన తల్లిని
తనబిడ్డ సమమేనంటూ ఆ తల్లి పాలిచ్చి తన ప్రేమ పంచిన
ఈనాడు ఆ తల్లినే కడకు బలిపసువు చేసిరి పాపులు
చేసిన మేలు మరిచి ఆ తల్లి ప్రాణము తీసిరి యమ సుతులు
||రామ రామ శ్రీరామ||
చరణం:3
ఏమని చెప్పెదను నా దేశము పడుతున్న బాధను
ఈనాటి సీతమ్మను చెరబట్టే రక్కసి రావణులెందరో
మానము ప్రాణములే కొనిపోవ అబలల వేధింతురు
మొరవిని వెను వంటనే మము కాపాడ రావయ్య రణభీమ 
||రామ రామ శ్రీరామ||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 

Wednesday 24 May 2017

పుష్కరములు వచ్చె పుణ్యనదికి

ఓం శ్రీ సాయిరాం
పుష్కరములు వచ్చె పుణ్యనదికి
కృష్ణమ్మకు ఆటవెలది పద్యాలు



ఆటవెలదిలోన యమ్మ కృష్ణమ్మకు 
అచ్చ తెలుగు పద్యమమరినాది
తప్పులెన్ని యున్న తనయుని మన్నింపుమ
జనులగాచునట్టి జలధి కృష్ణ

రత్న గిరిని బుట్టి రాష్ట్రాలు కలుపుతూ
జీవ నదిగ మాకు జీవమిచ్చె
రత్న సిరులు గన్న మాయమ్మ కృష్మమ్మ
అందుకొనుము నాంధ్ర స్వాగతములు

పొద్దుపొడుచు వేళ పుణ్యనదిని జూడ
పుణ్యమొ ఇది ఏదొ జన్మ వరమొ
పురము పురము నందు పులకించె జనులెల్ల
పుష్కరముల వార్త చెవిని పడగ

వేద భూమి నుండి వుదయించి ప్రవహించి
ఊరువాడలన్ని ఒండ్రు జేర్చె
రైతు రాజ్యమేలు తెలుగు నాటనునేడు
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

కృష్ణ కృష్ణ యన్న కష్ణముదీర్చేవు
కోరు కున్న వరము కలుగ జేసి
కోరి వచ్చు వారి కోర్కెలు తీర్చంగ
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

శివుని పదము చెంత శ్రీశైలమందున
కనక దుర్గ ఒడిని యమరె కృష్ణ
ఎన్ని క్షేత్రములో ఎన్ని తీర్థములో
పదము చెంత జేరి పరవసించె

గమనిక- ఈ పద్యాలు కృష్ణపుష్కరాల  సందర్భంగా అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక వారు ప్రచురించిన కృష్ణపుష్కరాల ప్రత్యేక సంచికలో చోటుకల్పించుకున్నాయి.


రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు