Wednesday 2 November 2016

తరియించే...నా జన్మా...

ఓం శ్రీ సాయిరాం

తరియంచే నా జన్మ

తేది: 20-01-2016.

పల్లవి :

సాయిరాముడే ఆది గురువని వివరించె నా రచన
పలుకులేలనో పల్లవించె నా భావమంతయూ తెలుప
మా కంటికి రెప్పవలే మా ఇంటను జ్యోతివైనా
సాయి...యిీ...యిీ...యిీ...యిీ...యిీ...యిీ
||సాయిరాముడే||

చరణం : 1   
నాలోని రూపమా నను కన్న దైవమా
మనసార కొలిచేను నిన్ను
ఈ జన్మయైన మరే జన్మమైనా
నీవేగ నా కన్న తల్లీ
కష్టాలు కన్నీళ్ళ సుడిగుండమందు
వెలలేని నీ ప్రేమ పంచి
నా తొలి రోదనలో మది వేదన రాగముగా
నా మది కోవెలలో ఒక దేవత రూపముగా
కొలువయ్యే మరొ బ్రహ్మ...
 ||సాయిరాముడే||

 చరణం : 2
ఏనాటి బంధమో ఏ జన్మ ఋణమో
ఈనాటి నా కన్న తండ్రీ
కాయమ్ము తనదిగా జ్ఞానమ్ము నిచ్చి
నా జీవన గమ్యాన్ని చూపే
బ్రతుకింత బరువైన బరియించి నన్ను
ఎనలేని ఓదార్పు నిచ్చి
కరిగిన మైనముగా మాకు వెలుగును చూపెడుతూ
వాడిన హృదయాలలో చిరుదివ్వెను వెలిగించే
ఇది తీరే ఋణమేనా...
||సాయిరాముడే||

చరణం : 3
కని పెంచు ప్రేమను కలిగించి నాకు 
కనుముందు లేవేల స్వామి
పలుమార్లు తలచినా పరికించి నన్ను
నీ లీల చూపేవు దేవా
కలలాంటి జీవితం కలమందు నిలిపి
మలిచావు ఈనాటి కవిగా
చీకటి బాపితివి...వేకువ చూపితివి
వేసిన అడుగులకు...ఊతము నిచ్చితివి
తరియించే నా జన్మా...
||సాయిరాముడే||


గమనిక:   ఈ పాటను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు భక్తితో సమర్పిస్తూ నా కన్న తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ రెడ్లం నాగమణి రాజగోపాలరావు పుణ్యదంపతులకు ప్రేమతో అంకితం.

 

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు.

Thursday 29 September 2016

కళ్యాణి మణిద్వీప మందున ఉదయించే తొలిరాగమై

ఓం శ్రీ సాయిరాం

కళ్యాణి మణిద్వీప మందున ఉదయించే తొలిరాగమై

తేది : 23-05-2016

పల్లవి :
సంగీతం శ్రుతిలయలుగా సాహిత్యం కృతి పలికెనే
లయతోడై రాగమ్ము రసమయ భావాన్నే పలికించగా
 ||సంగీతం||
చరణం :1
నాధంలో వెలిసింది రాగం స్వరగతులే ధ్వనియించగా
నాట్యంలో విరిసింది తాలం తాండవము లాస్యమ్ముగా
ఊహల్లో జనియించి భావం అక్షరమే ప్రతిరూపమవగా
గానంలో రసరమ్య గీతం హృదయాన్నే కదిలించలేదా
సంగీతం స్వరమేలే... సాహిత్యం పదమేలే...
చరణాలే జతచేరి పల్లవి గేయంలో జ్ఞానమ్ము తెలుపగ
 ||సంగీతం||
చరణం :2
కళ్యాణి మణిద్వీపమందున ఉదయించే తొలిరాగమై
ప్రతిరాగం కళ్యాణి నుండీ జతవీడి జనియించగా
ఓంకారం ప్రధమాక్షరముగా పలికేనే పాపాయిలే
ప్రతి మంత్రం ఉచ్ఛారమందున ప్రాణమ్మే ఓంకారమవగ
వేదాలే నాధాలై...ఓంకారం బీజాలై...
కుండలినీ జాగృతిని చేయుచు ఓంకారం సాగింది నాలో
 ||సంగీతం||

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు.

                                          

Wednesday 28 September 2016

నిరతము నాలో నిన్నే కొలువైపోనీ

ఓం శ్రీ సాయిరాం

నిరతము నాలో నిన్నే కొలువైపోనీ

తేది:30-03-2016.


పల్లవి:

మనసున రామ అని మెదిలిన తరంగమే
నిరతము నాలో నిన్నే కొలువైపోనీ
స్వరముల సారం నువ్వే పదముల భావం నువ్వే
హృదయపు వీణను మీటే రాగం నువ్వే

||మనసున||  
అను పల్లవి:
 
రాగమే నా స్వా సగా ఆడాలి నాలో హంస నాధం
హరి విల్లులో వర్ణాలుగా ఈ మౌనరాగం సాగే నాలో 
||మనసున||    

చరణం :1 

తొలిపొద్దు వికసించు కిరణాలు నీ వల్లే
జగమందు జ్యోతివి నువ్వే
ప్రతి నదిలా పయనించు జీవాత్మ నేనైతే
దరిజేర్చు సంద్రం నువ్వే
ఆ నింగిలో విహరించగా ఈ నేలపై చరియించగా
నివశించు జీవం నీ వల్లేగా
వేకువ నువ్వే వెన్నెల నువ్వే
భ్రమణ కాలం నీ వల్లేగా 
||మనసున||   

చరణం :2

తల్లేమొ ప్రకృతిగా తండ్రేమొ పురుషుడిగా
ప్రతి జీవి జనియించగా
జీవితమను బడిలోన ప్రకృతినే పాఠంగా
కాలముతో నేర్పించగా
చిరుదివ్వెలా... ప్రతి జీవిలో...
వెలుగొందు జ్ఞానం నీవల్లేగా
భవబందాలా పెనవేస్తావు చితిమంటతో సెలవంటావు
ఈమాయ లోకం నీవల్లేగా
 ||మనసున||  
  
   
గమనిక - ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక ఏప్రియల్ నెల 2016 సంచికలో ప్రచురించబడినది.    
 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

 

ఈ తొలిప్రేమ యెదలోన చిగురించని

ఓం శ్రీ సాయిరాం

ఈ తొలిప్రేమ యెదలోన చిగురించని

తేది: 25-01-2016
పల్లవి:
ఏడు జన్మాలకు వీడిపోలేమని 
రెండు హృదయాలను నేడు ఒకటవ్వని
ఈ తొలిప్రేమ యెదలోన చిగురించని
నా మదినేలు మహరాణి నీవేనని
||ఏడు జన్మాలకు||
అను పల్లవి:
 
శ్రుతివే నీవైతె లయ నేనే
చితిలో తోడుండే నీ జతనైరానా
 ||ఏడు జన్మాలకు||
చరణం 1:
ఈ చిరుగాలి తాకిడే రేపే నీ మేని హొయలు
నీ పెదవంచు నవ్వులే అవి నా మనసంత దోచె
నీ మీద నాకున్న ప్రేమకి నీ మదిని చోటీయవా
అలివేణి చెక్కిళ్ళ చాటున తను సిగ్గుల మొగ్గైనది
 ||ఏడు జన్మాలకు||
చరణం 2:
ఈ బంగారు బొమ్మతో వేసే అనురాగ బంధం
ఈ చిలకమ్మ ఊసులే నాలో రేపేను భావం
నీ ఊహ యదమీటి తాకితే నా వేణి శ్రుతి పలికెనే
నాలోని భావాలు వెల్లువై నీ హృదయాన్ని కదిలించని
 ||ఏడు జన్మాలకు||
గమనిక - ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక మే నెల 2016 సంచికలో ప్రచురించబడినది.   
రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

 

                                

నా పదములో ఒదిగినా భావమా

ఓం శ్రీ సాయిరాం

నా పదములో ఒదిగినా భావమా

తేది : 19-12-2015.       

 

పల్లవి: 
ప్రణయమా నా ప్రాణమా
పలుకవే నా హృదయమా
నా పదములో ఒదిగినా భావమా
నను కవినిగా చేసినా బంధమా
||ప్రణయమా||

చరణం :1
ఆనాటి నుండీ ఈనాటి వరకు 
నాలాంటి నిన్ను నే చూడలేదు
నిద్రాణమైన నా అంతరంగం
నీ ప్రేమ తాకి చిగురించె మళ్ళీ
నీలోన నేను ఉన్నానొ లేనో 
నా అంతరంగం తొలిచింది నన్ను
నా ప్రేమ నీకు వినిపించలేక
ఈ పాట రచన చేసింది మనసు
సఖివై చెలివై వినలేవా...  
||ప్రణయమా|| 

చరణం : 2 
లేచింది మొదలు నిదురించు వరకు
నీ జ్ఞాపకాలే ఎదురేగుతుంటే
గతమంత చెరిపే నీ ప్రేమతీపి 
నాలోన చేరి నను ముంచుతుంటే
మనసంత తెరచి వేచాను నీకై
నాతోని నువ్వు జతచేరు వరకు
ఏ జన్మ వరమో నీ ప్రేమ ఫలము
ఈనాటి నన్ను శ్రుతి చేసినావు
సఖివై చెలివై వినలేవా...   
||ప్రణయమా||
గమనిక - ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో మార్చ్ నెల 2016 సంచికలో ప్రచురించబడింది
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

ధ్యానం

              ఓం శ్రీ సాయిరాం

                     ధ్యానం                  





                                                                                                       -- రెడ్లం చంద్రమౌళి
          
       పలమనేరు