Thursday 10 January 2019

లాస్య గీతం

ఓం శ్రీ సాయిరాం

లాస్య గీతం

పల్లవి

అరుణబింబ మంబరాన 
అతిశయంగ అలసి సొలసి
సంధ్య వేళ సొమ్మసిల్లి 
ఛాయ చెంత సేదదీరి
కిరణమొకటి పట్టుదప్పి జారిందంట
శ్రీ దివ్య దోసిట్లో చేరిందంట

||అరుణబింబ మంబరాన||

చరణం 1
స్వాగతాల భంగిమలో సంధ్యకాల వందనాన
సూర్యుడినే హారతిగా ఇస్తూ వుంటే
కృష్ణమ్మ హొయలన్నీ వేళ
తనలోనే పొదిగింది బాల
కెరటాలను తన కాలికి ముడివేసింది
భరతం తన పదమందున ప్రభవించింది
తా...తై... తక... ఝం... ఝం... ఝం...
తా...తై... తక... ఝం... ఝం... ఝం...

||అరుణబింబ మంబరాన||

చరణం 2
 
అభినయించు అంగాంగం రసవిధ్యా సంగమమై
లావణ్యం లాస్యంతో లయమౌతుంటే
కృష్ణమ్మా ఒడిలోనీ వేళ
తాండవమే చేసిందీ బాల
హృదయం పరవశమై తను నర్తిస్తుంటే
చరణం శ్రుతి లయలై నది రవళిస్తుంటే 
గీతం... ధ్వనియించింది...
నాలో... జనియించింది...

||అరుణబింబ మంబరాన||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

తనలోని ఆమె (కవిత)

ఓం శ్రీ సాయిరాం

తనలోని ఆమె (కవిత)




ఆహా !
ఎంత స్వచ్ఛమైన నీరో
పసిపాపల నవ్వులా, పాల నురగలా
పచ్చని తోరణాలనడుమ
ప్రకృతి ఒడిలో ప్రవహిస్తూ
కళ్ళను, మనసును ఇట్టే కట్టిపడేస్తోంది
తనలోకి తొంగి చూసిన ఆమె ప్రతిబింబాన్ని
అద్దంలా ప్రస్పుటంగా చూపిస్తోంది
అలా అలా ఆమె చేతివేళ్ళతో
తనను తాను ముద్దాడాలనుకోగానే
అలల తెరలతో 
ఆమెను తనలోనే దాచేసుకుంది
కానీ...
ఆమెకు తెలీదు పాపం 
ఆటలాడుకుంటోంది
బ్రతుకు బాటలో 
ఆమె పాదాలు మోసుకొచ్చిన
బాధల బురదలను 
ఆనవాళ్ళులేకుండా కడిగేస్తున్నాయని 
ఈ సెలయేటి పరవళ్ళు
అడుగడుగునా ఎన్ని అవరోధాలను అధిగమిస్తున్నా
చిరునవ్వుల గల గలలనే వినిపిస్తాయే తప్పా
కన్నీరు ఇసుమంతైనా కనిపించదు
అందుకే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనా
మనిషి జీవితానికి అద్దంపడుతూ
సరికొత్త జీవిత పాఠాన్ని ప్రభోదిస్తుంది
 ***
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

మౌనమై మేలుకొంటున్నా

ఓం శ్రీ సాయిరాం

మౌనమై మేలుకొంటున్నా


పల్లవి

విధాతే తలచి రాసినాడో ప్రతిమని చెరిపి గీసినాడో
ప్రభాతం ప్రేరణిస్తున్నా రాత్తిరికి రాలిపోతున్నా
ప్రయత్నం యెంత చేస్తున్నా ప్రయాసే నాకు మిగిలేనా
కాలమే కాలదంతున్నా మౌనమై మేలుకొంటున్నా

|| విధాతే తలచి రాసినాడో ||

చరణం 1

ప్రకృతి గీసిన చిత్రానికి కాలంపూసే వర్ణాలతో
వసివాడినా... వికసించదా
మరణం గెలిచిన తన గుండెలో విరసే పచ్చని రోజిప్పుడు
తలరాతకి... తెలబోయెనా...
మదిలో ఆశలు రేగితే ముసిరే చీకటి కమ్మితే
గెలిచే పిలుపు చేరువకానని పారిపోయేనా

|| విధాతే తలచి రాసినాడో ||

చరణం 2

ఉరిమే ఉప్పెన ప్రళయానికి ఊరువాడ మటుమాయమై
ఒకనాటికి... చిగురించవా...
వెలుగే పడని తన గూటిలో మెరిసే ముత్యపు విలువేమిటో
తనవారికి... తెలిసేదెలా...
కాలం మారే తీరులో గెలుపు ఓటమి పావులై
బళ్ళే ఓడలు ఓడలు బళ్ళై మారిపోయేనా 

|| విధాతే తలచి రాసినాడో ||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

పెళ్ళి బంధం

ఓం శ్రీ సాయిరాం

పెళ్ళి బంధం


పల్లవి

తెలుసా ఈ పెళ్ళి బంధం జతేపడ్డ జంటలకిపుడు
బ్రతుకే చిదిమేసుకోగా కాపురాన కలతల చిక్కి
ఎవరికి వారే యమునా తీరే అనుకొంటే సరిపోతుందా
ఏం పాపం చేసారండి విరిసేటి పసికుసుమాలు

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

చరణం 1

ఇల్లాలే నీ ఇంట వెలుగొందే జీవనజ్యోతి
నూరేళ్ళు సౌభాగ్యం నిలిపేటి మంగళగౌరి
కలిమైనా... లేమైనా... నీ చెలిమితో
కడదాక ఈదేను తన ఓర్పుతో
నీ వంశం నిలిపే కృషిలో సంసారపు సమిధౌతుంది

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

చరణం 2

మనసెరిగి మసిలేటి చెలికాడు నీసైదోడు
సంసారపు వృక్షాన్ని మోసేటి వేరౌతాడు
ఇసుమంత నలతైన పడనీయకా
పసుపతిలా తనలోని సగమిచ్చుగా
తన నెత్తుటి తైలం పోసి ఈ బండిని నడిపిస్తాడు

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
ఈ గీతం అచ్చగా తెలుగు అంతర్జాల మాస పత్రికలో ప్రచురించబడినది 

Wednesday 9 January 2019

స్వప్నం (Dream)

ఓం శ్రీ సాయిరాం

స్వప్నం




పల్లవి

ఇది మరో ప్రపంచపు వేదిక
మన మనోగతానికి సూచిక
కన్నుల లోగిలిలో... కాంచిన ప్రతిబింబం
రెప్ప వెనకాల స్వప్నాల తీరము

||ఇది మరో ప్రపంచపు|| 

చరణం 1

రెప్పచాటు లోకమిది రాత్రివేళ పుడుతుంది
మేలుకున్న మరు నిముషం జాడలేని మిథ్యయిది
చుట్టంలాగ వచ్చిపోయె పెన్నిధి మాటేరాని మౌనమిది
నాలో ఉన్న ఆరాటాలు నే చేస్తున్న పోరాటాలు
అద్దంలాగ చూపిస్తున్నది

||ఇది మరో ప్రపంచపు||
చరణం 2

ఎన్ని మూగ భావాలో రెప్పకింద దాస్తుంది
ఉన్న కొన్ని నిముషాలే మదిని కుదుట పెడుతుంది
చీకట్లోన పుట్టిపోయె సంగతి నవరస భరితమిది
నన్నే నాలో ప్రతిబింబిస్తూ నాకే నన్ను చూపించేస్తూ
తారా తీరం చేరుస్తున్నది

||ఇది మరో ప్రపంచపు||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
ఈ గీతం అచ్చంగా తెలుగు మాస పత్రికలో ప్రచురించబడినది.