Wednesday 24 May 2017

పుష్కరములు వచ్చె పుణ్యనదికి

ఓం శ్రీ సాయిరాం
పుష్కరములు వచ్చె పుణ్యనదికి
కృష్ణమ్మకు ఆటవెలది పద్యాలు



ఆటవెలదిలోన యమ్మ కృష్ణమ్మకు 
అచ్చ తెలుగు పద్యమమరినాది
తప్పులెన్ని యున్న తనయుని మన్నింపుమ
జనులగాచునట్టి జలధి కృష్ణ

రత్న గిరిని బుట్టి రాష్ట్రాలు కలుపుతూ
జీవ నదిగ మాకు జీవమిచ్చె
రత్న సిరులు గన్న మాయమ్మ కృష్మమ్మ
అందుకొనుము నాంధ్ర స్వాగతములు

పొద్దుపొడుచు వేళ పుణ్యనదిని జూడ
పుణ్యమొ ఇది ఏదొ జన్మ వరమొ
పురము పురము నందు పులకించె జనులెల్ల
పుష్కరముల వార్త చెవిని పడగ

వేద భూమి నుండి వుదయించి ప్రవహించి
ఊరువాడలన్ని ఒండ్రు జేర్చె
రైతు రాజ్యమేలు తెలుగు నాటనునేడు
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

కృష్ణ కృష్ణ యన్న కష్ణముదీర్చేవు
కోరు కున్న వరము కలుగ జేసి
కోరి వచ్చు వారి కోర్కెలు తీర్చంగ
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

శివుని పదము చెంత శ్రీశైలమందున
కనక దుర్గ ఒడిని యమరె కృష్ణ
ఎన్ని క్షేత్రములో ఎన్ని తీర్థములో
పదము చెంత జేరి పరవసించె

గమనిక- ఈ పద్యాలు కృష్ణపుష్కరాల  సందర్భంగా అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక వారు ప్రచురించిన కృష్ణపుష్కరాల ప్రత్యేక సంచికలో చోటుకల్పించుకున్నాయి.


రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

No comments:

Post a Comment