Sunday 9 July 2017

మనసు మధనం

ఓం శ్రీ సాయిరాం

మనసు మధనం


అంతరంగం ఆలోచనలో మునిగి
మనసును మధించడం మొదలుపెట్టింది
ఊహల వలయాలు సుడులు తిరుగుతూ
లోతైన అన్వేషణ చేస్తున్నాయి
ఘాఢ నిశ్శబ్ధంలో
తొణికిసలాడుతున్న మనసును
చిలుకుతున్న శబ్ధంలోంచి
అనుబంధాలు బయటపడి
ఆత్మీయ సంకెళ్ళు వేసాయి
మమతానురాగాల కటకటాల వెనక్కి
నన్ను నెట్టాలని
అయినా మధనం ఆగలేదు
స్వప్నసుందరి ప్రత్యక్షమైంది
ప్రణయ కలశంతో
ఆమె అధరామృతాన్ని
నాపై ఒలకబోయాలని
వలపు చిచ్చురగిల్చి
మోహంతో నన్ను దహించాలని
అయినా మధనం ఆగలేదు
అపాయాలు, అన్యాయాలు
ద్వేషాలు, మోసాలు
ఈసడింపులు, ఛీత్కారాలు
నిరుద్యోగం, దారిద్ర్యం
హాహాకారాలు చేస్తూ
మనసును ముసురుకున్నాయి
అయినా మధనం ఆగలేదు
ముసిరిన చీకట్లు మసకబారాయి
తెల్లటి కాంతిపుంజాలు
అంతరంగంపై ప్రసరించి
హృదయ కవాటం తెరుచుకుంది
అక్షర కలశం బయటపడి
ఆ వెలుగు రేఖల తాకిడికి
నాడులన్నీ జాగృతం చెంది
వెన్నుపాములో వణుకుపుట్టింది
మస్తిష్కాన్ని ప్రేరేపించింది
ఉదయించిందొక వాణి
నా మనోవీణా తంత్రుల్ని మీటి మేల్కొల్పుతూ
చేతి వేళ్ళు కదులుతున్నాయి
కాగితంపై నుగ్గులు పెడుతూ
ఏవో దిద్దుకుంటున్నాయి
గీతలతో దారులు వేస్తూ
సమాసం చేస్తున్నాయి స్వభావానుసారం
సంధి చేస్తున్నాయి అటుకి ఇటుకి
అమరిపోతున్నాయి అక్షరాలు
లక్షణాన్ని బట్టి
రూపుదిద్దుకుంటున్నాయి పదాలు
భావాన్ని బట్టి
ఏరుకుంటున్నది కలం కావలసిన వాటిని
చేతి వేళ్ళ నున్నడుమ
పద భంగిమలతో నాట్యం చేస్తూ
అలంకారాలను అందిపుచ్చుకొంది భావం
అంతర్లీనంగా పురుడు పోసుకుని
స్వచ్ఛమైన కళ శ్రీకారం చుట్టుకొని
కవితా శిల్పం
కనుల ముందు సాక్షాత్కారమయింది

రచన
 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

No comments:

Post a Comment