Monday 2 April 2018

చంద్రమౌళి శతకం

ఓం శ్రీ సాయిరాం

చంద్రమౌళి శతకం 

ఆటవెలది పద్యాలు


1. ఘాటు తగ్గకుండ గుండెల్లొ గుచ్చినా
   చక్కదిద్ద గలదు చిన్న మాట
   పెద్దలిచ్చి పోయె పదునైన యీటెను
   చంద్రమౌళి మాట చదువ రండు

2. కత్తి బట్ట బోకు కరము విసరబోకు
    సూటి పోటి మాట చేటు దెచ్చు
    మాట గుచ్చుకున్న మానని గాయమౌ
    చంద్రమౌళి మాట చదువ రండు

3. కడుపు పండగానె కడుసంబరపడేరు
    పడతియందు నుండ పడదు మీకు
    జనని లేకయున్న జనులేరి జగమేది
    చంద్రమౌళి మాట చదువ రండు

4. చేయు సాయమింత చెప్పేది కొండంత
    చెప్పు కొందు రేమొ మెప్పుగోరి
    ఫలము లిచ్చు తరువు ఫలితంబు నడుగునా
    చంద్రమౌళి మాట చదువ రండు

5. గతము గాయమనుచు గతియె లేదననుచు
    తలచి తలచి వగచ తగదు నీకు
    శిలలు గాయ పడక శిల్పమెట్లౌనురా
    చంద్రమౌళి మాట చదువ రండు

6. గురువు మాట లెరువు గుణము తేట తెలుపు
    ఎరుగు శిష్యు లిప్పు డెంత మంది
    అమ్మ నెరుగ కున్న యాబ్రహ్మ నెరుగునా 
    చంద్రమౌళి మాట చదువ రండు

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

No comments:

Post a Comment