Monday 13 March 2017

హృదయమా మనసు తలుపు తీయకు

ఓం శ్రీ సాయిరాం

హృదయమా మనసు తలుపు తీయకు


హృదయమా మనసు తలుపు తీయకు
ప్రేమలో... తెలిసి నన్ను దించకు
ఊహలో... భావాల్ని రేపకు
ఊపిరే... వారధిగ చేయకు 
***
ప్రేమలోన పడిన మనసు పరవశించిపోవులే
వలపు వానలోన వయసు తడిచిపోవులే
మనసు మాట వినక మనిషే మారిపోవులే
విరహపు నిట్టూర్పుల సెగలు నిన్ను ముంచులే
ఓపగ నావల్ల కాదు వేడుకొందువే
హృదయమందు ప్రేమ గుణము ఎరుగవైదువే
అది చెప్పగ నావల్ల కాదు ఒప్పుకొందువే
చెలియ మనసు ఎరుగలేక చింతపడుదువు 
***
చెలియ కానరాగ మనసే చెప్పలేక
బిడియముతో నోటమాట రాకపోవును
ధైర్యముతో ఎదురుపడి చెప్పనెంచినా
సరే అనునో తమాషనునో ఎరుగలేవుగా
మనసుచెప్పి ఒప్పుకొన్న ప్రేమింతువు
కానరాని లోకములు తిరిగి వద్దువు
ప్రేమలోని మధురిమను చవిచూడగా
హృదయములు ఒక్కటిగా కలిసిపోవును 
***
ప్రేమ వికటమైన కలలే కూలిపోవును
మనసులోన వున్న మమతే మాసిపోవును
ప్రేయసినీ మరువలేక మౌనముగా మిగిలి
ఒంటరిగా వేదనలో కుమిలిపోదువు
కఠినమైన శిలలైనా కరిగిపోవును
కరుణలేని చలియమనసు కరుగలేదుగా
భారముతో భగ్న ప్రేమ హృదయమందునా
చావలేక బ్రతకలేక మిగిలిపోవును 
***
                                                                 --రెడ్లం చంద్రమౌళి 


                                                                                 పలమనేరు
 

అనుకోని కవితనై నిన్నల్లినాను

ఓం శ్రీ సాయిరాం

అనుకోని కవితనై నిన్నల్లినాను

కలువ రేకుల కళ్ళు కంటి నేనొకనాడు
కాలి అందెల యందు కళను చూసి
కనురెప్పల కౌగిలిలో దోబూచులాడుతు
ఓర చూపును నాపై విసిరికొట్టే
నను తాకినాచూపు నరనరాలను మీటి
ఉప్పొంగి కవితగా ఏరులై పారె
తొలి చూపుకెందుకో ఇంత పదును
తనువంత తపనతో తడిచి ముద్దాయె
అది చూసి ఆ వనిత సిగ్గు పడిపోగ
అధరాలు కెంపులై అరనవ్వు నవ్వే
సొట్ట బుగ్గల సిగ్గు సంపంగి మొగ్గలై
అందమంతా ఆమె మోముపై వాలె
దోర పెదవుల జామ ఎర్రగా పండి
చిలుకనై నిను తాక పరవశించేవు
ఏనాడు ఎరుగనే ఇంత అందము నేను
అనుకోని కవితనై నిన్నల్లినాను
నీలి ముంగురులు తాకి గాలి మేఘాలు
గగన వీధులు దాటి గంధాలు చిందె
గాలి పీల్చగ నువ్వు నాలోన చేరి
నా ఊపిరై నీవు నిలిచిపోయావు
ఇంతకన్నా నిన్ను వర్ణించగలనా
అందమా నీకింత పంతమేల
పరుగు పరుగున నువ్వు నాతోని చేర
ఆరోజు ఇంకెంత దూరమో లేదు
నా కవిత నిను చేరి పరవసించంగా
నాతోని నువు చేరి ప్రేమ పులకించేను
ఏ తీరుగది జరుగు ఎరుగనే నేను
కాలమే అందులకు బదులు తెలిపేను
ఎరుగవే ఇది సత్యమనగ నా కవిత
సూర్య చంద్రులు మనకు సాక్షులౌతారె.

                                                                                                        

                                                                                --రెడ్లం చంద్రమౌళి 
                                                                                                        పలమనేరు

Thursday 23 February 2017

ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం

ఓం శ్రీ సాయిరాం
ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం

పల్లవి:
పొత్తిళ్ళలో మొగ్గే తొడిగి ఓ కొమ్మలో పూచిన పువ్వే
కొమ్మా కంచె తల్లీ తండ్రిగా కన్నవారి కలలే పండగా


అను పల్లవి:
ఎదిగిందీ పసిపువ్వే విరిసిన మల్లియగా
వనమంతా తానే వెన్నెలగా నిశీధిలో వెలిగే పున్నమిగా 
||పొత్తిళ్ళలో||

చరణం: 1
కన్నవారి ప్రేమలో కలలు గన్న ఆశలో 
యవ్వనాలు పూచె ఈ మల్లె పువ్వులో
పూవులోని గంధము పరిమళింప చేయగా
విస్తరించెనంతము వీచు గాలిలో
వెదికే దిశలో ఉరికే కసిలో
విహరిస్తూ వచ్చాయి రాక్షస భ్రమరాలు
వనమంతా తామే రాజులుగా
వెదకంగా యవ్వన కుసుమాలు
||పొత్తిళ్ళలో|| 

చరణం: 2
సంధ్యవేళ సూర్యుడు మబ్బుచాటు చంద్రుడు
మూగ బోయి ప్రకృతి కళ్ళు మూయగా
గూడు చేరు వేళలో గుంపుచేరి భ్రమరాలు
ఒంటరైన పువ్వుపై వాలిపోవగా
ప్రమిదే విరిచి చమురే తీసి 
వెలుగొందే దీపాన్ని ఆరిపి వేసాయి
అది చూసి భారతి ఏడ్చింది
తన ఒడిలో కాంతను చేర్చింది 
||పొత్తిళ్ళలో|| 

చరణం: 3
ఓ కొమ్మలో పూచిన పువ్వులు
వనదేవతే తల్లిగ ఎదిగీ
వావి వరస మరిచే పోయెనా
మానవతను చెరిపే వేసెనా
ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్ని కణం
వెలిగిస్తే వెలుగును పంచేను
ఆర్పేవో హారతి దహియించు 
||పొత్తిళ్ళలో||  

గమనిక:  తల్లిదండ్రులు కలలు గన్న మరియు తమ కలలు, ఆశయాలు తీరకుండానే కొందరి రక్కసి మూకల కామదాహానికి బలైపోయిన ఎందరో సోదరీమణులు భరతమాత ముద్దు బిడ్డలు ఆ తల్లి ఒడిలో విగత జీవులై మిగిలిపోయారు. ఆ తల్లి గర్భశోకం తీర్చే తనయుడిగా ఈ పాటను స్త్రీలందరికీ అంకితమిస్తున్నాను.జై హింద్.

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు



 


                                                 

Wednesday 2 November 2016

తరియించే...నా జన్మా...

ఓం శ్రీ సాయిరాం

తరియంచే నా జన్మ

తేది: 20-01-2016.

పల్లవి :

సాయిరాముడే ఆది గురువని వివరించె నా రచన
పలుకులేలనో పల్లవించె నా భావమంతయూ తెలుప
మా కంటికి రెప్పవలే మా ఇంటను జ్యోతివైనా
సాయి...యిీ...యిీ...యిీ...యిీ...యిీ...యిీ
||సాయిరాముడే||

చరణం : 1   
నాలోని రూపమా నను కన్న దైవమా
మనసార కొలిచేను నిన్ను
ఈ జన్మయైన మరే జన్మమైనా
నీవేగ నా కన్న తల్లీ
కష్టాలు కన్నీళ్ళ సుడిగుండమందు
వెలలేని నీ ప్రేమ పంచి
నా తొలి రోదనలో మది వేదన రాగముగా
నా మది కోవెలలో ఒక దేవత రూపముగా
కొలువయ్యే మరొ బ్రహ్మ...
 ||సాయిరాముడే||

 చరణం : 2
ఏనాటి బంధమో ఏ జన్మ ఋణమో
ఈనాటి నా కన్న తండ్రీ
కాయమ్ము తనదిగా జ్ఞానమ్ము నిచ్చి
నా జీవన గమ్యాన్ని చూపే
బ్రతుకింత బరువైన బరియించి నన్ను
ఎనలేని ఓదార్పు నిచ్చి
కరిగిన మైనముగా మాకు వెలుగును చూపెడుతూ
వాడిన హృదయాలలో చిరుదివ్వెను వెలిగించే
ఇది తీరే ఋణమేనా...
||సాయిరాముడే||

చరణం : 3
కని పెంచు ప్రేమను కలిగించి నాకు 
కనుముందు లేవేల స్వామి
పలుమార్లు తలచినా పరికించి నన్ను
నీ లీల చూపేవు దేవా
కలలాంటి జీవితం కలమందు నిలిపి
మలిచావు ఈనాటి కవిగా
చీకటి బాపితివి...వేకువ చూపితివి
వేసిన అడుగులకు...ఊతము నిచ్చితివి
తరియించే నా జన్మా...
||సాయిరాముడే||


గమనిక:   ఈ పాటను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు భక్తితో సమర్పిస్తూ నా కన్న తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ రెడ్లం నాగమణి రాజగోపాలరావు పుణ్యదంపతులకు ప్రేమతో అంకితం.

 

-- రెడ్లం చంద్రమౌళి

పలమనేరు.