Wednesday 29 March 2017

అతిశయోక్తి గాదే ఇది అమరప్రేమ


   ఓం శ్రీ సాయిరాం

అతిశయోక్తి గాదే ఇది అమరప్రేమ


 కవిత
కాలమాగలేదు కవిత చెప్పుదునన్న
మనసు మరువలేదు మదిని నిన్ను
శిలను చేసినావు చెలిమి వీడుచు నేడు
చీకటాయె బ్రతుకు చెలియ లేక
 ***
అడుగులేసి నాను అర్థమ్ము తెలియక
వలపు తలపులలోన తడిచి తడిచి
వలచినప్పుడు లేదు విరహతాపము నాడు
విడిచినప్పుడు ఏల తెలియ వలయు
 ***
విడువ మనసు రాక విడిచి నెంచితి నేను
యదను రేపిన గాయమణచలేక
వలపు ఊయలలూపి వేరు మనమున జేరి
అంతరంగము నేల అమరినావు
చెరపలేకపోతి చేరిన హృదయాన్ని
మనసు తలుపులు మూసి విడువలేక
 ***
ఉన్న వూరు గాదే విడువక వద్దునన్న
కన్న భూమి గాదే కలిసి వచ్చునన్న
కులము ఒక్కటి గాదే కుదిరి వచ్చెదనన్న
మతము ఒక్కటి యున్న మరియేది ఫలితము
 ***
విరహమోపలేక వెదకు చుండగ నిన్ను
వేరు వాకిలిదీసి వెడలిపోతివి గాదే
విడువలేక మనసు వెక్కి వెక్కి యేడ్చె
అతిసయోక్తి గాదే యిది యమరప్రేమ
 ***
                                                                                                        -- రెడ్లం చంద్రమౌళి
                                                                                       పలమనేరు

Thursday 16 March 2017

ఆటవెలది పద్య రత్నాలు

ఓం శ్రీ సాయిరాం

ఆటవెలది పద్య రత్నాలు




ఆటవెలది లోన యపురూప పద్యాలు
అమర వలయు నేల కవన మందు
వేమ శతక మందు వెలుగు జూచె నిటుల
సరళ భావ పాద సౌష్ఠవమున 
(ఆటవెలదిని వివరిస్తూ ఈ పద్యం)
  
***

భూమిలోన ఇంత విత్తంబు లేకున్న
ఇంత మొక్క ఎటుల ఎదిగి వచ్చు
మనసులోన ఇంత చిత్తంబు లేకున్న
భక్తి భావమెటుల బయటి కొచ్చు
(భక్తిని వివరిస్తూ ఈ పద్యం)

***

పద్యమనగ నేదొ పదజాల మనుకోకు 
పద్యమనగ తెలుగు పదము విలువ
తల్లి నోట పలికి తరతరాలకు నందె
తెలుగు పద్య మిదియె తెలుసుకొనుము
(తెలుగు పద్యాన్ని వివరిస్తూ ఈ పద్యం)
 
***

అడుగులేసి జూడు అచ్చంగ తెలుగులో
తెలుగు భాష తీపి తెలియు నీకు
అన్య భాష లెన్ని వల్లె వేసిన గాని
తెలుగు విడువ బోకు తల్లి నీకు
(తెలుగు భాషను వివరిస్తూ ఈ పద్యం)

***

చిత్రమైన మనసు చింతలు పదివేలు
మైత్రి జేయు వాని మతము నెరుగు
తలపులెన్నో జేరి తెగిన గాలి పటమై
తలచుకున్న చాలు తరలిపోవు
(మనసును వివరిస్తూ ఈ పద్యం)

***

మసక మసక తెరల మబ్బు తాకిన మంచు
చినుకు చినుకు కలిసి చిలకరించె
విచ్చుకున్న విరుల వెలుగొందె చామంతి
పచ్చగుసిరి కాసి పలకరించె  
(హేమంత ఋతువును వివరిస్తూ ఈ పద్యం)

*** 




పద్యాలు వ్రాయడం ఏనాడు ఎరుగని నాచే ఆ సాయిరాముడు ఇలా పద్యాలు వ్రాయిస్తున్నారు.

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు


Monday 13 March 2017

హృదయమా మనసు తలుపు తీయకు

ఓం శ్రీ సాయిరాం

హృదయమా మనసు తలుపు తీయకు


హృదయమా మనసు తలుపు తీయకు
ప్రేమలో... తెలిసి నన్ను దించకు
ఊహలో... భావాల్ని రేపకు
ఊపిరే... వారధిగ చేయకు 
***
ప్రేమలోన పడిన మనసు పరవశించిపోవులే
వలపు వానలోన వయసు తడిచిపోవులే
మనసు మాట వినక మనిషే మారిపోవులే
విరహపు నిట్టూర్పుల సెగలు నిన్ను ముంచులే
ఓపగ నావల్ల కాదు వేడుకొందువే
హృదయమందు ప్రేమ గుణము ఎరుగవైదువే
అది చెప్పగ నావల్ల కాదు ఒప్పుకొందువే
చెలియ మనసు ఎరుగలేక చింతపడుదువు 
***
చెలియ కానరాగ మనసే చెప్పలేక
బిడియముతో నోటమాట రాకపోవును
ధైర్యముతో ఎదురుపడి చెప్పనెంచినా
సరే అనునో తమాషనునో ఎరుగలేవుగా
మనసుచెప్పి ఒప్పుకొన్న ప్రేమింతువు
కానరాని లోకములు తిరిగి వద్దువు
ప్రేమలోని మధురిమను చవిచూడగా
హృదయములు ఒక్కటిగా కలిసిపోవును 
***
ప్రేమ వికటమైన కలలే కూలిపోవును
మనసులోన వున్న మమతే మాసిపోవును
ప్రేయసినీ మరువలేక మౌనముగా మిగిలి
ఒంటరిగా వేదనలో కుమిలిపోదువు
కఠినమైన శిలలైనా కరిగిపోవును
కరుణలేని చలియమనసు కరుగలేదుగా
భారముతో భగ్న ప్రేమ హృదయమందునా
చావలేక బ్రతకలేక మిగిలిపోవును 
***
                                                                 --రెడ్లం చంద్రమౌళి 


                                                                                 పలమనేరు
 

అనుకోని కవితనై నిన్నల్లినాను

ఓం శ్రీ సాయిరాం

అనుకోని కవితనై నిన్నల్లినాను

కలువ రేకుల కళ్ళు కంటి నేనొకనాడు
కాలి అందెల యందు కళను చూసి
కనురెప్పల కౌగిలిలో దోబూచులాడుతు
ఓర చూపును నాపై విసిరికొట్టే
నను తాకినాచూపు నరనరాలను మీటి
ఉప్పొంగి కవితగా ఏరులై పారె
తొలి చూపుకెందుకో ఇంత పదును
తనువంత తపనతో తడిచి ముద్దాయె
అది చూసి ఆ వనిత సిగ్గు పడిపోగ
అధరాలు కెంపులై అరనవ్వు నవ్వే
సొట్ట బుగ్గల సిగ్గు సంపంగి మొగ్గలై
అందమంతా ఆమె మోముపై వాలె
దోర పెదవుల జామ ఎర్రగా పండి
చిలుకనై నిను తాక పరవశించేవు
ఏనాడు ఎరుగనే ఇంత అందము నేను
అనుకోని కవితనై నిన్నల్లినాను
నీలి ముంగురులు తాకి గాలి మేఘాలు
గగన వీధులు దాటి గంధాలు చిందె
గాలి పీల్చగ నువ్వు నాలోన చేరి
నా ఊపిరై నీవు నిలిచిపోయావు
ఇంతకన్నా నిన్ను వర్ణించగలనా
అందమా నీకింత పంతమేల
పరుగు పరుగున నువ్వు నాతోని చేర
ఆరోజు ఇంకెంత దూరమో లేదు
నా కవిత నిను చేరి పరవసించంగా
నాతోని నువు చేరి ప్రేమ పులకించేను
ఏ తీరుగది జరుగు ఎరుగనే నేను
కాలమే అందులకు బదులు తెలిపేను
ఎరుగవే ఇది సత్యమనగ నా కవిత
సూర్య చంద్రులు మనకు సాక్షులౌతారె.

                                                                                                        

                                                                                --రెడ్లం చంద్రమౌళి 
                                                                                                        పలమనేరు