Thursday 10 January 2019

తనలోని ఆమె (కవిత)

ఓం శ్రీ సాయిరాం

తనలోని ఆమె (కవిత)




ఆహా !
ఎంత స్వచ్ఛమైన నీరో
పసిపాపల నవ్వులా, పాల నురగలా
పచ్చని తోరణాలనడుమ
ప్రకృతి ఒడిలో ప్రవహిస్తూ
కళ్ళను, మనసును ఇట్టే కట్టిపడేస్తోంది
తనలోకి తొంగి చూసిన ఆమె ప్రతిబింబాన్ని
అద్దంలా ప్రస్పుటంగా చూపిస్తోంది
అలా అలా ఆమె చేతివేళ్ళతో
తనను తాను ముద్దాడాలనుకోగానే
అలల తెరలతో 
ఆమెను తనలోనే దాచేసుకుంది
కానీ...
ఆమెకు తెలీదు పాపం 
ఆటలాడుకుంటోంది
బ్రతుకు బాటలో 
ఆమె పాదాలు మోసుకొచ్చిన
బాధల బురదలను 
ఆనవాళ్ళులేకుండా కడిగేస్తున్నాయని 
ఈ సెలయేటి పరవళ్ళు
అడుగడుగునా ఎన్ని అవరోధాలను అధిగమిస్తున్నా
చిరునవ్వుల గల గలలనే వినిపిస్తాయే తప్పా
కన్నీరు ఇసుమంతైనా కనిపించదు
అందుకే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనా
మనిషి జీవితానికి అద్దంపడుతూ
సరికొత్త జీవిత పాఠాన్ని ప్రభోదిస్తుంది
 ***
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

No comments:

Post a Comment