Thursday 5 October 2017

మనసుపాట మనసా వినవా

ఓం శ్రీ సాయిరాం

మనసుపాట మనసా వినవా



పల్లవి

వేల వేల వందనాలు నీకు 
ఓసి మనసా మాటే వినవా
తోచు మాటలన్ని పాటకూర్చనీవ 
మనసు పాట మనసా వినవా

అనుపల్లవి
ఊహలతో కలలకు రెక్కలు వేయకుమా
చెరిగినవో అతకవు ఆశలు రెేపకుమా
కలను కరిగేవుమా నిజం విను నా మాటలు 
||వేల వేల||
చరణం 1

నిజము మరిచేలా నిలువరించే 
స్వప్నలోకం తలపులే మూయనీ
నిదురలో ఉన్నా నీడలాగే 
వెంటసాగే కలతలే మాయనీ
జ్ఞాపకం నాటిది ఆశయం నేటిది
అనుకుంటూ తనకంటూ మార్గం వేయని
||వేల వేల||
చరణం 2

చిగురు తొడిగేలా చీకటింట
కంటిపాప వెలుతురే చూడని
స్థిరముగా ఉన్న మనసులోకి
మర్గమపుడు అడుగులే వేయని
జీవితం ఆశగా అనుభవం శ్వాసగా
దరిజేర్చే దారులుగా గమ్యం చేరని
||వేల వేల||   
ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడినది ఈ కింది లింకులో చూడగలరు
http://www.acchamgatelugu.com/2017/06/manasu-pata-vinava.html

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 

Sunday 9 July 2017

మనసు మధనం

ఓం శ్రీ సాయిరాం

మనసు మధనం


అంతరంగం ఆలోచనలో మునిగి
మనసును మధించడం మొదలుపెట్టింది
ఊహల వలయాలు సుడులు తిరుగుతూ
లోతైన అన్వేషణ చేస్తున్నాయి
ఘాఢ నిశ్శబ్ధంలో
తొణికిసలాడుతున్న మనసును
చిలుకుతున్న శబ్ధంలోంచి
అనుబంధాలు బయటపడి
ఆత్మీయ సంకెళ్ళు వేసాయి
మమతానురాగాల కటకటాల వెనక్కి
నన్ను నెట్టాలని
అయినా మధనం ఆగలేదు
స్వప్నసుందరి ప్రత్యక్షమైంది
ప్రణయ కలశంతో
ఆమె అధరామృతాన్ని
నాపై ఒలకబోయాలని
వలపు చిచ్చురగిల్చి
మోహంతో నన్ను దహించాలని
అయినా మధనం ఆగలేదు
అపాయాలు, అన్యాయాలు
ద్వేషాలు, మోసాలు
ఈసడింపులు, ఛీత్కారాలు
నిరుద్యోగం, దారిద్ర్యం
హాహాకారాలు చేస్తూ
మనసును ముసురుకున్నాయి
అయినా మధనం ఆగలేదు
ముసిరిన చీకట్లు మసకబారాయి
తెల్లటి కాంతిపుంజాలు
అంతరంగంపై ప్రసరించి
హృదయ కవాటం తెరుచుకుంది
అక్షర కలశం బయటపడి
ఆ వెలుగు రేఖల తాకిడికి
నాడులన్నీ జాగృతం చెంది
వెన్నుపాములో వణుకుపుట్టింది
మస్తిష్కాన్ని ప్రేరేపించింది
ఉదయించిందొక వాణి
నా మనోవీణా తంత్రుల్ని మీటి మేల్కొల్పుతూ
చేతి వేళ్ళు కదులుతున్నాయి
కాగితంపై నుగ్గులు పెడుతూ
ఏవో దిద్దుకుంటున్నాయి
గీతలతో దారులు వేస్తూ
సమాసం చేస్తున్నాయి స్వభావానుసారం
సంధి చేస్తున్నాయి అటుకి ఇటుకి
అమరిపోతున్నాయి అక్షరాలు
లక్షణాన్ని బట్టి
రూపుదిద్దుకుంటున్నాయి పదాలు
భావాన్ని బట్టి
ఏరుకుంటున్నది కలం కావలసిన వాటిని
చేతి వేళ్ళ నున్నడుమ
పద భంగిమలతో నాట్యం చేస్తూ
అలంకారాలను అందిపుచ్చుకొంది భావం
అంతర్లీనంగా పురుడు పోసుకుని
స్వచ్ఛమైన కళ శ్రీకారం చుట్టుకొని
కవితా శిల్పం
కనుల ముందు సాక్షాత్కారమయింది

రచన
 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Sunday 2 July 2017

ఇదే మాకు పాళి అదే మా నివాళి (Dedicated To Dr.C.Narayana Reddy)

ఓం శ్రీ సాయిరాం

ఇదే మాకు పాళి అదే మా నివాళి



ఇదో ఇదో గీతము రచించె భావి భారతం
అదో అదో ప్రాభవం తరించె మాతృ భారతం

ఇదో ఇదో గీతము సినారె ఆత్మకంకితం
అదో అదో ప్రాభవం సినారె కల్పనామృతం

గజళ్ళ గమనానివన్నా గేయాల గానాలు విన్నా
కథా కావ్య సాహితి సినారె పాళి సంతకం

భువిలోని  వృత్తాంతమంతా విశ్వంభరాతత్వమన్నా
ప్రకృతే ప్రమాణం దానికి మనిషి జీవనానికి

జరిగే ఘోరాలు విన్నా జనజీవితానివన్నా
ప్రపంచ పదులు నేటికి సమాధానం వాటికి

కొరతెంత కనబడుతు వున్నా సరితూగు విధ్వాంశులున్నా
ఇంకా వెలితి తీరదు సినారె కవిత పారదు

సినారె తెలుగు సాహితి తరాల భవిత వారధి
విశాల భరత జాతికి వరాల వెలుగు సారధి

ఇదే మాకు పాళి అదే మా నివాళి 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Sunday 4 June 2017

ప్రేమ స్వరూపం(Embodiment of Love)

ఓం శ్రీ సాయిరాం

ప్రేమ స్వరూపం




సాయి అను నామము లేకున్న
కలము ఎటుల కదుల గలదు
భక్తి యను భావము లేకున్న
మదిని కవిత ఎటుల కలుగు
***
సత్యం యను వేరు లేకున్న
ధర్మవృక్ష మెటుల నిలువ గలదు
శాంతి యను స్థాపన లేకున్న
మతములెటుల ఒకటిగ చేరగలవు
***
అహింస యను ఆయుధమే లేకున్న
జీవమెటుల బ్రతుక గలదు
సేవ యను మార్గము లేకున్న
గర్వ మెటుల తొలగ గలదు
***
ప్రేమ యను రూపము లేకున్న
సాయి నెటుల ఎరుగ గలము 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Thursday 25 May 2017

నా కవిత



ఓం శ్రీ సాయిరాం

నా కవిత


నిశి కేళిని చీల్చునట్టి ఉషోదయము నాకవిత

శిసిరానికి సెలవు పలుకు వసంతమే నాకవిత

ఒడ్డుచేర అలసిపోని అలల ఘోష నాకవిత

వినువీధిని చూపు నిలిపి ఎదుగు మొక్క నాకవిత

మంచు తెరలు తీయునట్టి తొలికిరణం నాకవిత

పున్నమిలో చంద్రకిరణ ప్రకాశమే నాకవిత

ఆకాశపుటంచు కొలుచు కొలమానం నాకవిత

అలుపెరుగని పోరాటపు అక్షరమే నాకవిత

కవిత రాయు కలమునకు కలల భాష నాకవిత

రాయలేని భావాలకు రాజధాని నాకవిత

అక్షరాల లక్షణాన అమరిన పద్యంబై

శతాబ్ధాలు చెరిగిపోని తెలుగు పదము నాకవిత

సాహిత్యపు శిఖరాన వెలుగొందిన తెలుగు కవుల పాదధూళి నాకవిత

జనుల గుండె లయను తెలుపు జానపదము నాకవిత

సుతిమెత్తని భావనలా పరిమళించు సిరిమల్లే నాకవిత

ఆకురాల్చు కొమ్మలకు ఆయువిచ్చు నాకవిత

రెప్పవేయు మెలకువలో జ్ఞానదీప్తి నాకవిత

రెప్పవాల్చు చీకటిలో ఆత్మజ్యోతి నాకవిత

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

కావాలయ్య రామ నీ రాజ్యం

ఓం శ్రీ సాయిరాం
కావాలయ్య రామ నీ రాజ్యం


పల్లవి:
రామ రామ శ్రీరామ మమ్ము పాలించంగా రావేల
మళ్ళీ రామ నీ రాజ్యం మాకు కావాలయ్యా ఈవేళ
ముల్లోకాలు రక్షించే ఓ సీతరామ రావేల
కల్లోలాలు సృష్టించే ఈ మోసం ద్వేషం మమ్మే వీడి పోవాల
 ||రామ రామ శ్రీరామ||
చరణం:1
కన్న తల్లిదండ్రలే నేడు బరువని విడిచేరు కొందరు
కొనలేని మమకారమే వీడి స్వార్ధాన్ని ప్రేమించే బిడ్డలు 
వరమని పెంచినదే నేడు బరువని తుంచేరు కొందరు
పసిమొగ్గ విచ్చకనే సిరిమల్లె ప్రాణాలు తాసేరు మర మనుషులు
||రామ రామ శ్రీరామ||
చరణం:2
కన్నతల్లి పాలకే కరువని ఆకలి తీర్చిన తల్లిని
తనబిడ్డ సమమేనంటూ ఆ తల్లి పాలిచ్చి తన ప్రేమ పంచిన
ఈనాడు ఆ తల్లినే కడకు బలిపసువు చేసిరి పాపులు
చేసిన మేలు మరిచి ఆ తల్లి ప్రాణము తీసిరి యమ సుతులు
||రామ రామ శ్రీరామ||
చరణం:3
ఏమని చెప్పెదను నా దేశము పడుతున్న బాధను
ఈనాటి సీతమ్మను చెరబట్టే రక్కసి రావణులెందరో
మానము ప్రాణములే కొనిపోవ అబలల వేధింతురు
మొరవిని వెను వంటనే మము కాపాడ రావయ్య రణభీమ 
||రామ రామ శ్రీరామ||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 

Wednesday 24 May 2017

పుష్కరములు వచ్చె పుణ్యనదికి

ఓం శ్రీ సాయిరాం
పుష్కరములు వచ్చె పుణ్యనదికి
కృష్ణమ్మకు ఆటవెలది పద్యాలు



ఆటవెలదిలోన యమ్మ కృష్ణమ్మకు 
అచ్చ తెలుగు పద్యమమరినాది
తప్పులెన్ని యున్న తనయుని మన్నింపుమ
జనులగాచునట్టి జలధి కృష్ణ

రత్న గిరిని బుట్టి రాష్ట్రాలు కలుపుతూ
జీవ నదిగ మాకు జీవమిచ్చె
రత్న సిరులు గన్న మాయమ్మ కృష్మమ్మ
అందుకొనుము నాంధ్ర స్వాగతములు

పొద్దుపొడుచు వేళ పుణ్యనదిని జూడ
పుణ్యమొ ఇది ఏదొ జన్మ వరమొ
పురము పురము నందు పులకించె జనులెల్ల
పుష్కరముల వార్త చెవిని పడగ

వేద భూమి నుండి వుదయించి ప్రవహించి
ఊరువాడలన్ని ఒండ్రు జేర్చె
రైతు రాజ్యమేలు తెలుగు నాటనునేడు
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

కృష్ణ కృష్ణ యన్న కష్ణముదీర్చేవు
కోరు కున్న వరము కలుగ జేసి
కోరి వచ్చు వారి కోర్కెలు తీర్చంగ
పుష్కరములు వచ్చె పుణ్యనదికి

శివుని పదము చెంత శ్రీశైలమందున
కనక దుర్గ ఒడిని యమరె కృష్ణ
ఎన్ని క్షేత్రములో ఎన్ని తీర్థములో
పదము చెంత జేరి పరవసించె

గమనిక- ఈ పద్యాలు కృష్ణపుష్కరాల  సందర్భంగా అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక వారు ప్రచురించిన కృష్ణపుష్కరాల ప్రత్యేక సంచికలో చోటుకల్పించుకున్నాయి.


రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు