Thursday 26 April 2018

ప్రణయ గీతం


ఓం శ్రీ సాయిరాం

ప్రణయ గీతం





పల్లవి:

కొరకొర చూపులు కొంటెతనంగా రారమ్మని పిలిచాయి
మిలమిల మెరిసే పెదవులు ఏదో ఇవ్వాలని పలికాయి

అను పల్లవి:

గుండెనే గుచ్చేయకే నీ చూపు విసిరేసి
ఆశనే రేకించకే అధరాలు ముడిచేసి
ఏనాడు చూడని అందం ఈనాడే ఎదురౌతుంటే
దివిలోని తారకలన్నీ కనురెప్పన వెలిగేస్తుంటే
అవునో కాదనో మతిపోయిందీక్షణం
||కొరకొర చూపులు||
చరణం:1

చెలియ చెంపలో సిగ్గు మొగ్గలే అందమేమొ బహుశ
వెన్నెలందుకే చిన్నబోయెనే నిన్ను చూసి తెలుసా
సోగ కన్నులా సొగసులతో హృదయవీణనే మీటావే
గోరువెచ్చని ఊసులతో నన్ను నీవు మరిపించావే
ఓ బ్రహ్మా... ఇది నీ మాయా... ఈ గుమ్మా...
సిరి చందన గంధపు ప్రేమ సుగంధం వెదజల్లేనురా
విధి నీ లీలేనురా...


||కొరకొర చూపులు||
చరణం:2

మగువ చూపులో మనసు ఎక్కడో తప్పిపోయెనేమో
వెదకి చూడగా ప్రణయ గీతమై నిన్ను చేరెనేమో
కంటికెదురుగా నువ్వుంటే గుండెకెందుకీ పరుగంటా
జోరు వయసులో ప్రతిజంట జారిపడ్డదే ప్రేమంటా
ఓ మనసా సరదా పడవే... నీవింక...
ఆ చక్కని నెచ్చెలి చెంతకు చేరే వంతెన ప్రేమని...
ఇది నిజమని నమ్మవే...
||కొరకొర చూపులు||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Monday 2 April 2018

చంద్రమౌళి శతకం

ఓం శ్రీ సాయిరాం

చంద్రమౌళి శతకం 

ఆటవెలది పద్యాలు


1. ఘాటు తగ్గకుండ గుండెల్లొ గుచ్చినా
   చక్కదిద్ద గలదు చిన్న మాట
   పెద్దలిచ్చి పోయె పదునైన యీటెను
   చంద్రమౌళి మాట చదువ రండు

2. కత్తి బట్ట బోకు కరము విసరబోకు
    సూటి పోటి మాట చేటు దెచ్చు
    మాట గుచ్చుకున్న మానని గాయమౌ
    చంద్రమౌళి మాట చదువ రండు

3. కడుపు పండగానె కడుసంబరపడేరు
    పడతియందు నుండ పడదు మీకు
    జనని లేకయున్న జనులేరి జగమేది
    చంద్రమౌళి మాట చదువ రండు

4. చేయు సాయమింత చెప్పేది కొండంత
    చెప్పు కొందు రేమొ మెప్పుగోరి
    ఫలము లిచ్చు తరువు ఫలితంబు నడుగునా
    చంద్రమౌళి మాట చదువ రండు

5. గతము గాయమనుచు గతియె లేదననుచు
    తలచి తలచి వగచ తగదు నీకు
    శిలలు గాయ పడక శిల్పమెట్లౌనురా
    చంద్రమౌళి మాట చదువ రండు

6. గురువు మాట లెరువు గుణము తేట తెలుపు
    ఎరుగు శిష్యు లిప్పు డెంత మంది
    అమ్మ నెరుగ కున్న యాబ్రహ్మ నెరుగునా 
    చంద్రమౌళి మాట చదువ రండు

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

Tuesday 13 February 2018

విరహ గీతం

ఓం శ్రీ సాయిరాం

విరహ గీతం


పల్లవి:

చిన్నారి సిరిమల్లీ ఎందుదొ జాబిల్లీ
తనజాడ తెలిసే మార్గం చూపించవే
ఇన్నినాళ్ళు ఊరుకుంది వయసు
మౌనమింక సాగదంది మనసు
హెచ్చరికలంపె నాకు ఇపుడు
దారిచెప్పి నీవు సాయపడరావా
నెలరాజా... రాజా... రాజా...
||చిన్నారి సిరిమల్లీ||

చరణం:1

తన్నుతానుగా అందిరాదుగా మనకై చంద్రమా
వద్దచేరి నా విరహవేదన నీవే తెలుపుమా
అదిరి పోవునో బెదిరి పోవునో నిన్నే చూడగా
కుసుమ కోమలి కుశల మడిగి నా మనసే చెప్పుమా
శ్వాసలో శ్వాసనై చేరే వేళకై
ఆశగా ఆమెకై వేచున్నానని
విన్నపాలు విని నన్ను చేరమని విన్నవించి రావా
||చిన్నారి సిరిమల్లీ||

చరణం:2

సగము తానుగా సగము నేనుగా కలిసేదెప్పుడో
జీవితాన నా చేయిపట్టుకొని నడిచేదెెప్పుడో
పాలు నీళ్ళలా పదము భావమై కలిసేదెప్పుడో
అడుగు అడుగునా తోడు నీడగా నడిచేదెప్పుడో
మనసులో మనసువై చేరే నా చెలి
బ్రతుకులో జంటగా తోడుంటావని
తెలుగు భాషలో తీర్చి కూర్చినా తీయనైన లేఖ
||చిన్నారి సిరిమల్లీ||

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు 


Sunday 5 November 2017

బొమ్మ బొరుసు

ఓం శ్రీ సాయిరాం

బొమ్మ బొరుసు (కవిత)



నిజానికి అవి బొమ్మ బొరుసులు
బ్రతుకు నాణానికి...
అయినా అవి జీవితాన్ని నడిపిస్తాయి
నాణెం లోకాన్ని నడిపించినట్లు
***
నిజానికి అవి బొమ్మ బొరుసులే...కానీ
కంటికి కనిపించని వెలుగు నీడలు
జీవితానికి ఎత్తుపల్లాలు
కాల చక్రంతో కలిసినడిచినా
ఒకదానికొకటి ఎదురుపడవు
ఎందుకంటే అవి పాదాల్లాంటివి
పక్కపక్కనే నిలబడ్డా
ఒకదాని వెనకే ఒకటి
రేయింబవళ్ళలా జతపడవు కానీ
ఏ ఒక్కటి లేకపోయినా బ్రతుకు తెలవారదు
*** 
నిజానికి అవి బొమ్మ బొరుసులే...అయినా
అమావాస్య చంద్రుడులా ఒకటి
వసంత భానుడిలా మరొకటి
వంచించినా...వరించినా
నేర్పేది పాఠాన్నే...దిద్దేది జీవితాన్నే
అందుకే అవి నాణానికి బొమ్మాబొరుసులు
బ్రతుకులో కష్టసుఖాలు
అవే మన జీవన ప్రమాణాలు
*** 

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Monday 23 October 2017

మదిగీతం

ఓం శ్రీ సాయిరాం

మదిగీతం

పల్లవి
మనసే కాగితం ప్రేమే కారకం
నీతోడై నడవాలి నా పాళీ
ఇది మదికావ్యం మధుగీతం కావాలి
మౌనంగా ఎదలోనే సాగాలి

చరణం:1
నాలో స్పందన నీవైతే
ఉదయించే ఊహలకు ఊపిరివే
ఊగించేవిలా మది ఉయ్యాలలా
నిన్నే వలచి నన్నే మరచి మురిసేనే కళా

చరణం:2
ఎదుటే లేవని తెలిసినా
నీకోసం ఆరాటం ఆగనిదే
మదిలో రూపమా మెదిలే భావమా
నా పదమందు ఒదిగే భావ కవితా సుందరీ 

గమనిక: ఈ గీతం ఆంధ్రజ్యోతి నవకలం శీర్షికలో ప్రచురించబడినది.

రచన 
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

Thursday 5 October 2017

తెలవారని రేయిని

ఓం శ్రీ సాయిరాం

తెలవారని రేయిని (కవిత)



తెలవారని రేయిని
చిగురంత ఆశ మొలకెత్తి నాలో 
పెనుచీకటంతా పొగమంచులాగ కరిగిందని
తెలవారని రేయిని
***
అరుణోదయాన అమవాస కళ్ళు
తెరతీసి వెలుగే చూడనీ
చంద్రోదయాన నా వాలు కళ్ళు
వెన్నెలతొ వెలుగే నిండనీ
ఆకాశమంత ఆశున్న చాలు 
ఏ చీకటైనా కరిగేనని
తెలవారని రేయిని
***
గుండెల్లొ మంట చల్లార్చుతున్న 
కన్నీటి పరుగు కలకాలం ఉండిపోలేదని
ఇన్నాళ్ళ వ్యధలు కాలాన కరిగి
ఈనాటితో వీడిపోవాలని
మునుపంటి కింద అధరాల బాధ
చిరకాలం నవ్వుకోవాలని
తెలవారని రేయిని
***
అవరోధమున్న నది ఆగుతుందా
ముంచెత్తి వరదై పొంగదా
వెనకడుగు పడిన అల ఊరుకుందా
అలుపంటురాక సాగదా
ఏ గమ్యమైనా నిను చేరుతుందా
వెంటపడి అడుగే వేయక
పరదాలు తీసి పలుకునా
దరిచేరు దారే చూపునా
తెలవారని రేయిని
***
పెనుముప్పు పొంచివున్న
నిను ముంచుకొచ్చిన
చెరగని చిరునవ్వే కదా ఆశన్నది
నడిరేయి ముంచిన
శిశిరాన్ని తుంచిన
బెదరని ధైర్యమే కదా ఆశన్నది
ఏనాడు విడువకు ఆశను నువ్వు
పెదవుల నవ్వులను
చిగురించిన ధైర్యం ఊపిరి తనకు
మరువకు కడవరకు
నమ్మకం నావగా ఆశయం శ్వాసగా
సాగిపో నేస్తమా
తెలవారని రేయిని 
 ***
ఈ కవిత అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడినది ఈ కింది లింకులో చూడగలరు 
http://www.acchamgatelugu.com/2017/07/tellavarani-reyini.html 
రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు

మనసుపాట మనసా వినవా

ఓం శ్రీ సాయిరాం

మనసుపాట మనసా వినవా



పల్లవి

వేల వేల వందనాలు నీకు 
ఓసి మనసా మాటే వినవా
తోచు మాటలన్ని పాటకూర్చనీవ 
మనసు పాట మనసా వినవా

అనుపల్లవి
ఊహలతో కలలకు రెక్కలు వేయకుమా
చెరిగినవో అతకవు ఆశలు రెేపకుమా
కలను కరిగేవుమా నిజం విను నా మాటలు 
||వేల వేల||
చరణం 1

నిజము మరిచేలా నిలువరించే 
స్వప్నలోకం తలపులే మూయనీ
నిదురలో ఉన్నా నీడలాగే 
వెంటసాగే కలతలే మాయనీ
జ్ఞాపకం నాటిది ఆశయం నేటిది
అనుకుంటూ తనకంటూ మార్గం వేయని
||వేల వేల||
చరణం 2

చిగురు తొడిగేలా చీకటింట
కంటిపాప వెలుతురే చూడని
స్థిరముగా ఉన్న మనసులోకి
మర్గమపుడు అడుగులే వేయని
జీవితం ఆశగా అనుభవం శ్వాసగా
దరిజేర్చే దారులుగా గమ్యం చేరని
||వేల వేల||   
ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడినది ఈ కింది లింకులో చూడగలరు
http://www.acchamgatelugu.com/2017/06/manasu-pata-vinava.html

రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు