Wednesday 10 July 2019

ఎవరీ ప్రియ భామిని


ఓం శ్రీ సాయిరాం

ఎవరీ ప్రియ భామినీ

 

 

 పల్లవి

ఎవరీ ప్రియ భామినీ...
చిరు నగవుల సొగసుల ఆమనీ...
ఎవరీ ప్రియ భామినీ...

చరణం - 1

అందరాని చందమామ ఆమె మోమై తోచినట్టు
ఏటవాలు కళ్ళతోనే పిలువకున్నా పిలిచినట్టు
తొలకరింత చిలికినట్టు మనసుకేదో తుళ్ళిపాటు
అనిముషులల్లే నిలిచిపోతి కళ్ళార తనరూపు చూడాలని  

చరణం - 2

ముద్దబంతి బుగ్గలందు కన్నెయీడు నుగ్గులేసే
ఇంద్రధనస్సు రంగుమారి ఆమె కనులా బొమ్మలాయే
బాల అరుణ బింబమేమో నుదుటిపైనే కుంకుమాయే
అనిముషులల్లే నిలిచిపోతి కళ్ళార తనరూపు చూడాలని  


రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
 

Wednesday 15 May 2019

ఉదయించిన కిరణాన్ని


ఓం శ్రీ సాయిరాం

ఉదయించిన కిరణాన్ని


కన్నాను నే కలలెన్నో
నెరవేర్చే దారులలో అడుగడుగు తడబడుతూ
నిరుపేదను స్థితిలో నేను తలవంచని గగనాన్ని
నిదురించిన స్వప్నం కోసం ఉదయించిన కిరణాన్ని
 ***
జీవిత మధనం చేస్తూ కష్టాలను చవిచూసేవురా
గుండెకు ధైర్యం పోస్తూ మరణాన్నే గెలుపొందేవురా
బ్రతుకంటేనే పెను సవాళ్ళు... పోరాడి గెలుపొందరా...
***
కాటుక చీకటి లోకం ఓ కోడై కూతలు కూయగా
కంటికి నిద్దుర లేక నడిరేయంతా వగచేవురా
ఆ క్షణాన శిశిరమౌతున్నా... చైత్రాలు వికశింపవా
 ***
ఆటూ పోటుల నడుమ పడి లేచే కెరటం జీవితం
కాలం నెమరేస్తున్నా అణువణువు పొందిన జ్ఞాపకం
ఓటమెదురైన గెలుపునీదైన నేర్చుకోవాలి పాఠాలురా
 ***
గెలిచే పిలుపు నిన్ను కనులారా చూడాలందిరా
ఓటమి కౌగిలి వీడి నీ ఉనికిని చాటు ముందరా
ఉదయ కిరణాన్ని కనగ ఇకనైన నీ దారి మళ్ళించరా 
 ***
దూరంగుందనుకుంటే జడివానే నేలను చేరునా
భారంగుందనుకుంటే ఈ మన్నే నిన్ను మోయునా
అలసిపోతున్నా ఆశ బతికున్నా దూర భారాలు కడతేరవా
 ***
జీవించాలని ఉందా ప్రతి నిత్యం పోరాడాలిరా
ఆశల తీరం వెంట నీ అడుగులు వేస్తూ సోదరా
పడిలేస్తున్నా... పరుగుతీస్తున్నా... విజయాల తీరానికే

రచన
చంద్రమౌళి రెడ్లం


Wednesday 3 April 2019

భావుక గీతం

ఓం శ్రీ సాయిరాం

భావుక గీతం


పల్లవి

ఎందరి అనుబంధం 

పెనవేసిన భావుక అరవిందం

చల్లని సాయంత్రం 

నను అల్లిన మల్లెల సుమగంధం

 

చరణం-1

తొలకరి చినుకుల మేఘం

భువి మదిలో వేసిన బీజం

కవిలో సిరి మువ్వల నాధం

అక్షరమే అలరారు తీరం

 

చరణం-2

వెదుకాడే వెన్నెల కోసం 

పూర్ణోదయ చంద్ర వికాశం

శశి కాంతిలో చకోరం

భావుకలో మన మానస తీరం

 

చరణం-3

ఉదయించిన కలల ప్రపంచం

తెలుగుదనానికి ప్రతిబింబం

ఎటు చూసినా విరిసే వసంతం

గ్రోలిన మధురస భావ విలాసం

 

చరణం-4

పదుగురు పంచిన భాష్యం

ప్రతి మదినీ మీటిన హాస్యం

ఝరిలో పదమంజరి లాస్యం

భావుక నవరస నర్తన మాధ్యం 

రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు

Thursday 10 January 2019

లాస్య గీతం

ఓం శ్రీ సాయిరాం

లాస్య గీతం

పల్లవి

అరుణబింబ మంబరాన 
అతిశయంగ అలసి సొలసి
సంధ్య వేళ సొమ్మసిల్లి 
ఛాయ చెంత సేదదీరి
కిరణమొకటి పట్టుదప్పి జారిందంట
శ్రీ దివ్య దోసిట్లో చేరిందంట

||అరుణబింబ మంబరాన||

చరణం 1
స్వాగతాల భంగిమలో సంధ్యకాల వందనాన
సూర్యుడినే హారతిగా ఇస్తూ వుంటే
కృష్ణమ్మ హొయలన్నీ వేళ
తనలోనే పొదిగింది బాల
కెరటాలను తన కాలికి ముడివేసింది
భరతం తన పదమందున ప్రభవించింది
తా...తై... తక... ఝం... ఝం... ఝం...
తా...తై... తక... ఝం... ఝం... ఝం...

||అరుణబింబ మంబరాన||

చరణం 2
 
అభినయించు అంగాంగం రసవిధ్యా సంగమమై
లావణ్యం లాస్యంతో లయమౌతుంటే
కృష్ణమ్మా ఒడిలోనీ వేళ
తాండవమే చేసిందీ బాల
హృదయం పరవశమై తను నర్తిస్తుంటే
చరణం శ్రుతి లయలై నది రవళిస్తుంటే 
గీతం... ధ్వనియించింది...
నాలో... జనియించింది...

||అరుణబింబ మంబరాన||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

తనలోని ఆమె (కవిత)

ఓం శ్రీ సాయిరాం

తనలోని ఆమె (కవిత)




ఆహా !
ఎంత స్వచ్ఛమైన నీరో
పసిపాపల నవ్వులా, పాల నురగలా
పచ్చని తోరణాలనడుమ
ప్రకృతి ఒడిలో ప్రవహిస్తూ
కళ్ళను, మనసును ఇట్టే కట్టిపడేస్తోంది
తనలోకి తొంగి చూసిన ఆమె ప్రతిబింబాన్ని
అద్దంలా ప్రస్పుటంగా చూపిస్తోంది
అలా అలా ఆమె చేతివేళ్ళతో
తనను తాను ముద్దాడాలనుకోగానే
అలల తెరలతో 
ఆమెను తనలోనే దాచేసుకుంది
కానీ...
ఆమెకు తెలీదు పాపం 
ఆటలాడుకుంటోంది
బ్రతుకు బాటలో 
ఆమె పాదాలు మోసుకొచ్చిన
బాధల బురదలను 
ఆనవాళ్ళులేకుండా కడిగేస్తున్నాయని 
ఈ సెలయేటి పరవళ్ళు
అడుగడుగునా ఎన్ని అవరోధాలను అధిగమిస్తున్నా
చిరునవ్వుల గల గలలనే వినిపిస్తాయే తప్పా
కన్నీరు ఇసుమంతైనా కనిపించదు
అందుకే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనా
మనిషి జీవితానికి అద్దంపడుతూ
సరికొత్త జీవిత పాఠాన్ని ప్రభోదిస్తుంది
 ***
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

మౌనమై మేలుకొంటున్నా

ఓం శ్రీ సాయిరాం

మౌనమై మేలుకొంటున్నా


పల్లవి

విధాతే తలచి రాసినాడో ప్రతిమని చెరిపి గీసినాడో
ప్రభాతం ప్రేరణిస్తున్నా రాత్తిరికి రాలిపోతున్నా
ప్రయత్నం యెంత చేస్తున్నా ప్రయాసే నాకు మిగిలేనా
కాలమే కాలదంతున్నా మౌనమై మేలుకొంటున్నా

|| విధాతే తలచి రాసినాడో ||

చరణం 1

ప్రకృతి గీసిన చిత్రానికి కాలంపూసే వర్ణాలతో
వసివాడినా... వికసించదా
మరణం గెలిచిన తన గుండెలో విరసే పచ్చని రోజిప్పుడు
తలరాతకి... తెలబోయెనా...
మదిలో ఆశలు రేగితే ముసిరే చీకటి కమ్మితే
గెలిచే పిలుపు చేరువకానని పారిపోయేనా

|| విధాతే తలచి రాసినాడో ||

చరణం 2

ఉరిమే ఉప్పెన ప్రళయానికి ఊరువాడ మటుమాయమై
ఒకనాటికి... చిగురించవా...
వెలుగే పడని తన గూటిలో మెరిసే ముత్యపు విలువేమిటో
తనవారికి... తెలిసేదెలా...
కాలం మారే తీరులో గెలుపు ఓటమి పావులై
బళ్ళే ఓడలు ఓడలు బళ్ళై మారిపోయేనా 

|| విధాతే తలచి రాసినాడో ||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

పెళ్ళి బంధం

ఓం శ్రీ సాయిరాం

పెళ్ళి బంధం


పల్లవి

తెలుసా ఈ పెళ్ళి బంధం జతేపడ్డ జంటలకిపుడు
బ్రతుకే చిదిమేసుకోగా కాపురాన కలతల చిక్కి
ఎవరికి వారే యమునా తీరే అనుకొంటే సరిపోతుందా
ఏం పాపం చేసారండి విరిసేటి పసికుసుమాలు

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

చరణం 1

ఇల్లాలే నీ ఇంట వెలుగొందే జీవనజ్యోతి
నూరేళ్ళు సౌభాగ్యం నిలిపేటి మంగళగౌరి
కలిమైనా... లేమైనా... నీ చెలిమితో
కడదాక ఈదేను తన ఓర్పుతో
నీ వంశం నిలిపే కృషిలో సంసారపు సమిధౌతుంది

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

చరణం 2

మనసెరిగి మసిలేటి చెలికాడు నీసైదోడు
సంసారపు వృక్షాన్ని మోసేటి వేరౌతాడు
ఇసుమంత నలతైన పడనీయకా
పసుపతిలా తనలోని సగమిచ్చుగా
తన నెత్తుటి తైలం పోసి ఈ బండిని నడిపిస్తాడు

|| తెలుసా ఈ పెళ్ళిబంధం ||

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
ఈ గీతం అచ్చగా తెలుగు అంతర్జాల మాస పత్రికలో ప్రచురించబడినది