Saturday 13 July 2019

హృదయ కుసుమం

ఓం శ్రీ సాయిరాం

హృదయ కుసుమం





               అవి గాఢ హేమంతపు చలి రాత్రులు, చుట్టూ కమ్ముకున్న చిమ్మ చీకట్లో తెల్లని మంచుగోడలు కట్టుకుని హేమంతం జూలు విదుల్చుతుంది. ఒళ్ళంతా మంచుతో కప్పియున్న ప్రకృతి, భీకరమైన చలి గాలుల తాకిడికి వణికిపోతున్నది. నిశీధి నుండీ మంచు బిందువులు తెరలు తెరలుగా రాలుతూ సన్నని చిరు ఝల్లుల వలే ప్రకృతి ఒంటిపై నుండీ జారి పడుతున్నాయి. జంతువులు, పక్షులు తమ తమ గూటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెట్లు వాటి కొమ్మలు బెరడులు ఆకులతో శరీరాలను కప్పుకుని తీవ్రమైన చలి గాలుల తాకిడి నుండీ తమను తాము కాపాడుకుంటున్నాయి. కానీ ఒక్కచోట మాత్రం ఈ భయంకరమైన వాతావరణాన్ని తట్టుకొని నిలబడిందొక గులాబీ మొక్క. అతడి శరీరం అంతా ఆవరించి ఉన్న సూది మొనల్లాంటి వంపులు తిరిగిన పదునైన నల్లటి కురులు అతడి దేహాన్ని కప్పి ఉంచగా, అదిచూసి వెంటనే అతడిని చుట్టుముట్టి, అమాంతం విరుచుకుపడిందా హేమంతం. కాని ఈ భీకరమైన చలి గాలులు, పొగ మంచు తనని ఏమీ చేయలేవనే తెగింపు అతడి మేనిలో ప్రభవించి కనిపించినట్లనిపించింది ఆ హేమంతానికి. అతడి ద్రుఢ సంకల్పానికి ఏమి చేయలేక అతనిని విడిచి దూరంగా వేళ్ళపోయిందా హేమంతం.


ఇంతలో సూర్యోదయం రానే వచ్చింది. అప్పటి వరకు ప్రకృతిని తన బిగి కౌగిట బంధించిన పొగమంచు ఒక్కసారిగా కరిగి ఇంటి ముందు కళ్ళాపి జల్లినట్లు ప్రకృతి ఒంటిపై చిలకరించి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి నేలపై పడి ఇంకిపోయింది. పొద్దు పొడుస్తున్న వేళ కావడంతో నునులేత సూర్యకిరణాల తాకిడికి నవ యవ్వనపు సౌందర్యంలోనికి అడుగులేస్తున్న ఆ గులాబీ మొక్క ద్రుఢమైన శరీరంలో యవ్వనపు సొబగులు మంచులో తడిసిన ముత్యాల వలే మెరిసిపోతున్నాయి. చుట్టూ సూర్యకాంతి వ్యాపించి ఆ వనమంతా ఒక్కసారిగా చలికాచుకుంది. తోటలో ఉన్న పూల మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు అన్నీ భానుడి కిరణాలు తాకి వెచ్చని స్వాసను పీల్చుకుని ఆస్వాదించాయి. ఇదిలా ఉండగా...


గులాబీ మొక్కకు ఆమడ దూరంలో ముళ్ళ పొదలున్నాయి. ఆ ముళ్ళ పొదలకూ గులాబీ మొక్కకు మద్యలో ఒక సన్నని మల్లె తీగ పాకుతూ పోతున్నది. దాని చుట్టూ వున్న చిన్న చిన్న గడ్డి మొక్కలను ఆసరాగా చేసుకొని పాకుతూ పాకుతూ చివరికి ఒక ముళ్ళ చెట్టు దగ్గరకు వచ్చి చేరింది. అప్పటికే ఆధారంలేక ఎన్నో శ్రమల కోర్చి సుదూర ప్రయాణం చేసి అలిసిపోయిందా మల్లెతీగ. ఎటువెళ్ళాలో తెలియక పక్కనే వున్న ముళ్ళచెట్టును అల్లుకుందామనుకుంటున్న మల్లెతీగను


ఇలా వారించిందా ముళ్ళచెట్టు....


ఎందుకు నన్నల్లుకుంటున్నావ్ ....


నా ఒంటిపైనున్న పదునైన ముళ్ళు చూశావ వాటి ధాటికి నీ శరీరం తాళలేదు. అసలే సుకుమారివి ఎంతో ఎత్తుకు ఎదగవలసిన దానవు ఇంకా మొగ్గైనా తొడగని నునులేత మల్లెతీగవు నావల్ల నీ భవిష్యత్తు నాశనం కాకూడదు, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో, ఎప్పుడూ ఒకరి పై ఆధారపడడం కాదు నీకై నువ్వు ఎదగాలి ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం వుండాలి అని చెప్పి ఆ లతను సున్నితంగా వారించిందా ముళ్ళచెట్టు.


ముళ్ళచెట్టు మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిందా మల్లెతీగ అతడి మాటలు ఆమెలో భాధను కలిగించాయి. వెంటనే కోపంతో మారుమాట్లాడక తన దారిని వెదుక్కుంటూ అక్కడి నుండీ వెళ్ళిపోయింది. తరువాత ఆ లత అక్కడకు మరికొద్ది దూరంలో నిర్జీవమైన రాతి బండను అల్లుకుని ఎదుగుతూ వచ్చింది. ఆ రోజు అతడి మాటలు కఠినంగా అనిపించినా ఆలతను ఆలోచింపజేసాయి. ప్రతి రోజూ అతడు చెప్పిన మాటలను తలుచుకుంటూ పెరిగి పెద్దదైంది. అతడి మాటలు ఆమెలో ప్రేరణ కలిగించాయి. తన జీవితాన్ని ప్రేమించడం నేర్పాయి, తనని తాను ప్రేమించుకోవడం నేర్పాయి. ఆమెలోని కలిగిన ఈ రస స్పందనకు అంకురార్పన జరిగింది ఆమాటలతోనే. అంతే ఒక్కసారిగా ఆ లత తన స్పందనలకు కార్యరూపం ఇవ్వాలని తలచి తన ఆలోచనలను అక్షరాలుగా మలిచి సరికొత్త జీవితానికి మార్గ నిర్దేశం చేసుకుంది. తన సుకుమారమైన తీగలతో కలంపట్టి నవ కవితా లోకంలోనికి అడుగులేసింది. తన కమ్మని కథలతో కవితలతో శ్రోతల హృదయాలలో పూష్ప వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని తనను ఇలా చూసుకుంటూ అందుకు కారణమైన అతనికి మనస్సులోనే తన కృతజ్ఞతను తెలుపుకుంది.


ఆ రోజు నుండీ అతనిపై ఆరాధన భావం ఆమెతోపాటే పెరిగి పెద్దదైంది. అది రోజు రోజుకీ మరింత పెరిగి ప్రేమగా చిగురించి మొగ్గతొడిగింది. రోజుకో రెక్కగా విచ్చుకుని పూవుగామారి ప్రేమగా పరిమళించింది. ప్రతి రోజూ ఏదో ఒక విధంగా తన ప్రేమను తెలుపుతూ ఆ ముళ్ళచెట్టుని అల్లుకోవాలని చూసిందా మల్లెతీగ. అది తెలుసుకున్న ముళ్ళచెట్టు అందుకు ప్రతిస్పందనగా తన భావాన్ని ఇలా చెప్పేది


సమయమాసన్నమైనపుడు కాలమే అందుకు బదులు చెబుతుందని....


ఆ మాటలకు , అతడి నిగ్రహానికి నివ్వెరపోయిందా మల్లె తీగ. అతడి పై తన ప్రేమ రెట్టింపై కట్టలు తెంచుకుంది. ఏ గమ్యంలేక ఎటో వెళ్ళిపోవాల్సిన తన జీవితాన్ని నిలబెట్టిన అతడిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిందా లత. అతడు ఆమెలో రేపిన ఆ విరహ తాపాన్ని భరిస్తూ ఎన్నో తీయని వెన్నెల రాత్రులను జంటగా గడపాల్సిన తను ఒంటరిగా వృధాగా గడిపేది. ఆమె విరహ తాపాన్నంతా కమ్మని కవితలుగా మలిచి తన ప్రియునికి పవన సందేశం పంపేది. ప్రతి రోజు ఇలా తన ప్రేమ సందేశాన్ని ప్రియునికి తెలిపేది. కాని అప్పటికి ఇప్పటికి అతడి సమాధానం మాత్రం ఒక్కటే అన్నింటికీ కాలమే బదులు చెబుతుందని ఆ మాటలకు ఒక్కోసారి విసిగిపోయినా మరలా అతడిపై తన ప్రేమ ఇంకా రెట్టింపయ్యేది. ఇలాగే చాలా కాలం గడిచింది అయినా వారిరువురి కలయికా ప్రశ్నార్ధకంగా మారింది.


ఒకనాడు గులాబీ మొక్క అతని స్నేహితులతో కలిసి శరత్ కాల పున్నమి వెన్నెలలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రిని అనుభవిస్తూ సేదదీరుతుండగా ఎక్కడి నుండో ఒక హృదయ రాగం వాళ్ళ చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆ కోకిల స్వరాన్ని వింటూ ఉండిపోయారు. ఆ రాగం ఒక కమ్మని పాటగా మారి గానం చేస్తూ గాలి పల్లకీ ఎక్కి మత్తైన మల్లెల సువాసనలను వెదజల్లుతూ గులాబీ మొక్కతో సహా అతని స్నేహితులను పరధ్యానంలో పడేసి అలా విహంగంలో సాగిపోయింది. ఒక్కసారిగా ఆ కమ్మని రాగం వీరి స్వాసలో చేరి హృదయాన్ని తాకింది. అంతే అక్కడున్నవారంతా ఆ సుగంధ భరిత మల్లెల సువాసనలో కమ్మని ఆ పాటలో మైమరచిపోయి కాసేపు అలాగే మత్తుగా ఉండిపోయారు. కొద్దిసేపటి తరువాత ఏదో శబ్దానికి అందరూ ఉలిక్కిపడిలేచారు. వెంటనే ఒకరినొకరు చూచుకుని ఎక్కడి నుండి వచ్చిందా కోకిలగానం అని అంతా అనుకున్నారు. ఇలా రోజూ కొంత కాలం గడిచింది.


గులాబీ మొక్క రోజు ఆ మల్లెతీగ మధుర గానం వింటూ తన హృదయంలో ప్రేమ మొగ్గ తొడిగింది అది రోజు రోజుకూ చిగురించి విచ్చుకుని ప్రేమ పరిమళాన్ని వెదజల్లడం మొదలుపెట్టింది ఆ మత్తైన మల్లెల సుగంధంతో గులాబీ పరిమళంతో కలవగానే గులాబీ మొక్క ఒక గొప్ప రసానుభూతికి లోనయ్యేవాడు ఇక తన విరహాన్ని ఆపుకోలేక తన ప్రేయసికి తన పుప్పొడి తో పవన సందేశం పంపింది ఆ పుప్పొడి రేణువులు మెల్లగా మల్లెతీగను వాలి గులాబీ హృదయాన్ని ఆవిష్కరించాయి. అందులో ఇలారాసి ఉంది...


ఓ ప్రేయసీ నా హృదయ వాసీ...


నేను నీ ప్రేమబావిలో పడి మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నాను ఎందుకంటే నాకు ఈదటం రాదు. అందుకే అందులో ఉన్న ప్రేమామృతాన్ని తాగేసి ఆ మత్తులో నుంచీ ఇలాంటి కవితలు రాస్తున్నాను. నా ప్రేమని అంగీకరించి నన్ను ఈ మహాసముద్రం నుండీ బయటికి తీస్తావో లేక కాదని ఇందులోనే ముంచి సమాధి చేస్తావో అంతా నీదే భారం ప్రియా...


అనుకోని ఈ సంఘటనకు మల్లెతీగ సందిగ్దంలో పడిపోయింది. కాస్త తేరుకొని ఓ హృదయ రాజా నేను నీ ప్రేమ సందేశాన్ని గౌరవిస్తున్నా కానీ నీ ప్రేమను అంగీకరించలేను ఎందుకంటే నా మనసు వేరొకరితో జతపడిపోయింది నా వల్ల ఏదైనా తప్పు జరిగివుంటే మన్నించు నీవు ఎటువంటి విరహ వేదనలో ఉన్నావో నేను కూడా అంతే విరహంతో నా ప్రియుని చేరాలని తపిస్తున్నాను కానీ అతని మనసు ఇంకా కరుగలేదు అందుకోసం నేను ఎన్నాళ్ళైనా నిరీక్షించగలను నా అంతరంగాన్ని అర్థం చెసుకుంటావని మనసార కోరుకుంటూ నీకు నాకన్నా మంచి భాగస్వామి దోరకాలని కోరుకుంటూ మల్లెతీగ తన పుపుపొడిని గులాబీ వద్దకు పంపింది.


ఒక్కసారిగా గులాబి భగ్న హృదయమై వాడిపోయింది తన ముళ్ళతో తన హృదయాన్ని పోడుచుకుని రెక్కలు రాల్చుకుని శిధిలమైపోయి రాలిపోయింది. మళ్ళీ ఏదో ఆశ తన ప్రేయసి మారకపోతుందా అని తనను మేల్కొలుపుకొని పురివిపిప్పిన రోజా తన ప్రేయసికి మళ్ళీ సందేశం పంపింది. మల్లెతీగ మళ్ళీ తిరస్కరించింది మళ్ళీ రోజా ముళ్ళు గుచ్చుకోవడం వాడిపోవడం రాలిపోవడం రోజు ఇది మామూలైపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత మల్లెతీగ మారదని తెలుసుకున్న గులాబీ సందేశం పంపడం మానేసింది తనని ఇంకా బలవంతం చేయాలనుకోలేదు. రాలిపోయిన తన హృదయపు రెక్కలను చూస్తూ కుమిలిపోయింది తరువాత గుండెరాయి చేసుకుంది తర్వాత ఆలోచనలో పడింది నిజం తెలుసుకుని మేల్కొంది.


ప్రేమకు స్పందించని హృదయం కూడా ఒక హృదయమేనా అనుకొని తన ప్రేయసిని వెతుకుతూ పయనమయ్యింది. తనను తానుగా ఇష్టపడే ప్రేయసి కోసం రోజూ కలలు కంటూ తన హృదయ రోజాని వికసింపజేస్తూ పుప్పొడులతో పవన సందేశం పంపుతూ తన ప్రేయసి కోసం ఎదురుచూడసాగింది.


శిశిరం వచ్చిందని వసంతం, కష్టం వచ్చిందని సంతోషం రాకుండా పోతాయా ఒక గులాబీ రాలిపోయిందని ఇంకో గులాబీ రాకుండా పోతుందా, చిగురు తొడగకుండా పోతుందా, ఒక ప్రేయసి కాదంటే ప్రేమ చచ్చిపోయినట్లేనా మనకోసం ఎక్కడో ఒకచోట మన హృదయరాణి పుట్టే ఉంటుంది టైమొచ్చినప్పుడు తప్పక కలుస్తుంది జీవితాన్ని పంచుకుంటుంది అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ప్రేమ పుడుతుంది. అంతేకానీ మనసుకు నచ్చిందని ,కంటికి కనిపించిందంతా మన ప్రేయసి అనుకొని బ్రతకడం మన భ్రమ, నిజం తెలుసుకుని ప్రస్తుతంలో బ్రతకడం నిజమైన ప్రేమికుడి లక్షణం.


రచన

రెడ్లం చంద్రమౌళి

పలమనేరు

No comments:

Post a Comment