Friday 12 July 2019

బృందావన రహస్యం (Historic Scientific Fiction)

ఓం శ్రీ సాయిరాం

బృందావన రహస్యం(Historic Scientific Fiction)







          సాయంత్రం వేణుగోపాల స్వామి ఆలయంలో భజన కార్యక్రమం ముగియగానే స్వామి వారికి హరతి సమర్పించి కృష్ణా... ముకుందా... గోవిందా... అనుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు శ్రీధరాచార్యులు. ఇంతలో ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన భారీవర్ష సూచన కనబడింది. భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వారి వారి ఇళ్ళకు పరుగులు తీసారు. ఇంతలో వర్షం రానే వచ్చింది. శ్రీధరాచార్యులు గబగబా గుడికి తాళం వేసి ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో అతని కొడుకు సుదర్శనుడు గొడుగు పట్టుకొని నాన్నగారు అంటూ ఎదురొచ్చాడు. సుదర్శనా ఇంతవర్షంలో నువ్వెందుకొచ్చావు నాయనా... వర్షం పడుతుందని అమ్మ పంపింది నాన్న గారు అన్నాడు. సరే సరే పద పద త్వరగా ఇల్లు చేరాలి వర్షం ఎక్కువవుతున్నది అని ఇద్దరూ ఇంటికి పరుగుతీసారు. అసలే వర్షాకాలం కావడంతో ఉరుములు మెరుపులతో వర్షం బాగా జోరందుకుంది. శ్రీధరాచార్యులు కుమారుడితో సహా ఇల్లు చేరుకున్నారు.



ఇంటికి వచ్చిన భర్తకి భార్య అచ్చమాంబ వేడి వేడిగా కాఫీ ఇచ్చింది. కాస్త సేదతీరాక భార్యతో ఆ మాట ఈ మాట ముచ్చటిస్తూ ఏమేవ్ ఈ పూట వంట ఏంచేస్తున్నావేమిటి, మన సుదర్శనానికి ఇష్టమని దప్పడం చేస్తున్నానండి అంది అచ్చమాంబ ఊ.. కొడుతూ... వర్షం పడుతుండటంతో కరెంటుపోయింది ఇల్లంతా చిమ్మ చీకటి అలుముకుంది. అమ్మా చందన దీపం వెలిగించమ్మా అంది అచ్చమాంబ వంటగది నుండి కూతుర్ని పిలుస్తూ..., అలాగేనమ్మా అంటూ దీపం వెలిగించింది చందన... బయట ఉరుములు మెరుపులతో వర్షం విరుచుకుపడుతోంది మరో పక్క గాలికి కొన్ని చెట్ల కొమ్మలు విరిగి పడుతున్న శబ్ధాలు వినపడుతున్నాయి. హఠాత్తుగా భారీ శబ్ధం ఇంటిల్లిపాదినీ భయాందోళనలకు గురిచేసింది. మనకు దగ్గరలో ఎక్కడో భారీ పిడుగుపడిందని అన్నాడు శ్రీధరాచార్యులు. ఇంటిలోనివారంతా భయబ్రాంతులుకు లోనయ్యారు. ఆ రాత్రంతా కరెంటు రాలేదు సరికదా వర్షం పడుతూనే ఉంది.



తెల్లవారగానే స్నాన సంధ్యాదులు ముగించుకుని, రాత్రి కురిసిన భారీ వర్షం మూలంగా ఊరంతా జలమయం కావడంతో గుడికి కాస్త ఆలస్యంగా బయలుదేరాడు శ్రీధరాచార్యులు, సగం దూరం వచ్చాక, అప్పటికే గుడి తెరవబడి ఊరి జనమంతా గుడిదగ్గర గుమిగూడి ఉండడం చూసాడు, ఏమయి ఉండవచ్చునో అని పరుగు పరుగున వచ్చాడు గుడిదగ్గరకి, అందరిని తప్పించుకొని లోనికి వెళ్ళాడు. ఆలయ ధర్మకత్తలు గుడి తలుపులు తెరిపించి, లోపల ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. ఏమి పాలుపోలేదు శ్రీధరాచార్యులకి ఏమి విపత్తు సంభవించిందో అని ఆందోళనగా అడిగాడు ధర్మకత్తలని అందులో ఒక ధర్మకర్త మరేం లేదు స్వామి ధ్వజస్తంభం వద్ద భారీ పిడుగు పడి బృందావనం కూలిపోయింది అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన శ్రీధరాచార్యులకి మతిపోయినట్లయింది, వెంటనే తేరుకుని రాత్రి వినిపించిన భారీ విస్పోటనం ఇదేనన్నమాట అని తలుచుకొని అయ్యో అయ్యో ఎంతటి అపచారం జరిగిందని పరుగు పరుగున వెళ్ళి చూసాడు. వారు చెప్పినట్టుగానే బృందావనం విరిగి ఒక వైపుగా ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. వెంటనే వెళ్ళి ధర్మకత్తలతో మాట్లాడి, దానిని సరిచేసే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించాడు శ్రీధరాచార్యులు. అందుకు ధర్మకత్తల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని దానిని పునర్నిర్మించాలని సంకల్పించారు.

 

సమావేశం ముగించుకుని గుడిలోనికి వెళ్ళిన శ్రీధరాచార్యులు స్వామివారికి అభిషేకార్చనలు ముగించి అలంకరిస్తుండగా సుదర్శనుడు ప్రసాదం తీసుకువచ్చాడు. స్వామివారికి నైవేద్యం సమర్పించి వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. ఈలోగా సుదర్శనుడు గుడి ప్రాంగణమంతా కలియతిరిగి తండ్రివద్దకు వచ్చాడు. ఎందుకు నాన్నగారు బృందావనం పడిపోయింది అని తండ్రిని ప్రశ్నించగా రాత్రి పడిన భారీ పిడుగు వల్ల ఇంతటి అపచారం జరిగింది నాన్నా అన్నాడు. ఎందుకు నాన్నా అపచారం మనం కావాలనే చేసిన పని కాదు కదా అనుకోకుండా జరిగింది. అయినా అసలు ఆ బృందావనం గురించి ఇంతగా ఎందుకు చింతిస్తున్నారు అని అడిగాడు సుదర్శనుడు. ఆ వివరాలన్నీ తీరిగ్గా ఇంటికెళ్ళాక చెప్తానులే నాన్నా అని, ఆలయంలో కార్యక్రమాలను త్వరగా ముగించుకొని భోజనానికి ఇంటికి బయల్దేరారు తండ్రీకొడుకులు. అక్కడ అచ్చమాంబ…, భోజనాల వేళయింది వీళ్ళు ఇంకా రాలేదని ఎదురుచూస్తుండగా ఇంటికి చేరుకున్నారు. భోజనాలు ముగించుకొన్న తర్వాత సుదర్శనుణ్ణి పిలిచి ఈ ఆలయ చరిత్రను ఇలా వివరిస్తాడు...

 

నాయనా సుదర్శనా ఈ వేణుగోపాల స్వామి ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని శ్రీ అచ్యుతరాయల వారు నిర్మింపజేసినట్లు చరిత్ర చెప్తున్నది అందుకు నిదర్శనమే ఆలయంలో చెక్కబడిన శిలా శాసనాలు. ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. ఆలయంలోని శిల్పకళ విజయనగర రాజుల ప్రతిభకు కళా తృష్ణకు నిలువెత్తు నిదర్శనం. వారి ఆలయ నిర్మాణ శైలి, కౌశలం అత్యంత శ్లాఘనీయం. ఈ ఆలయానికొక విశిష్టత ఉంది. వారిచే నిర్మించబడ్డ మిగతా ఆలయాలకు ఈ ఆలయానికి ఉన్న వ్యత్యాసమేమిటంటే, ఈ ఆలయం హంపీ నగరంలోని విరూపాక్షి ఆలయాన్ని పోలివుండడమే ఇందులో విశేషం, అందువలన ఈ ఆలయం ఇంతటి ప్రత్యేకతని సంతరించుకుంది. అందుకే ఈ ఆలయానికి విరూపాక్షి అని కూడా పేరు వచ్చింది. ఆలయంలోని శిల్పసంపద అత్యంత రమణీయంగా చూపరులను ఇట్టే కట్టిపడేసి ఏదో నిగూఢార్థాల్ని చెప్తున్నట్టుగా ఉంటుంది. గర్భాలయం, ప్రవేశమండపం, ధ్వజస్తంభం, రాతిగోపురం, బృందావనం, చుట్టూ రాతితో నిర్మించిన విశాలమైన ప్రాంగణం ఇలా అన్నీ శిల్ప సౌందర్యంతో తొణికిసలాడుతుంటాయి. అందులోకి ఆ బృందావనానికి చెక్కబడ్డ చిన్ని కృష్ణుణ్ణి చూసేవూ వేణువూదుతూ తనతో రాసక్రీడలకు రమ్మని పిలిచినట్లు ఉంటుంది... బృందావనానికి మరో పక్క చెక్కబడ్డ హనుమంతుడు, పండ్లు తింటున్నట్లు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రాతి గోపురం గోడలకు ఇరువైపులా సూర్యచంద్రులతో కూడిన రాహుకేతువుల ప్రతిమలను రాతిపై అద్భుతంగా చెక్కారు. చూపరులను అబ్బురపరిచే చారిత్రక నిర్మాణం ఇది, ఇంతకాలమైనా చెక్కుచెదరని పనితనం వారి సొంతం, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రాచరికపు చరితలకు ప్రత్యక్ష సాక్షీభూతము ఈ ఆలయం. ఎందరో పర్యాటకులకు ఈ ఆలయ అంగ భంగిమల శిల్ప సౌష్ఠవం కనులవిందుచేస్తుంది అని చెబుతూ ఈ కాలంలో ఇలాంటి నిర్మాణశైలి అసాధ్యం అని ముగించి సాయంకాలం కావస్తుండటంతో గుడికి బయల్దేరాడు శ్రీధరాచార్యులు.... 

 

మార్గ మధ్యంలో ఒక ధర్మకర్త ఎదురుపడి స్వామీ... రేపు బృందావన పనర్నిర్మాణ పనులు చెపడుతున్నాము ఎందుకంటే ఎలాగూ మరో వారం రోజులలో గోకులాష్ఠమి రానే వస్తున్నది అందువల్ల పాత బృందావనాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయించి మరలా పునః ప్రతిష్టాపన జరిపిద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీధరాచార్యులు అది విని సరేనని ఆలయానికి వెళ్ళి సాయంసంధ్యా కార్యక్రమాలను యధాతధంగా జరిపించి ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు బృందావన పనర్నిర్మాణ పనులు చేపట్టి ప్రతిష్టాపన సాయంకాలనికల్లా పూర్తిచేశారు.

తరువాతి రోజు నుండీ ఆచార్యులు యధావిధిగా బృందావనానికి పూజలు జరిపించేవారు. ఇలా వారం రోజులు గడిచింది గోకులాష్టమి రానే వచ్చింది. ఆలయాన్ని ఊరి వారంతా కలిసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు , ప్రత్యేక పూజలు జరిపించి, అన్నదానాలు, ప్రసాద వితరణలు చేయించారు. గోవులకు పూజలు చేసారు. అన్నీ తానై ఈ కార్యక్రమాన్నంతా దగ్గరుండి నడిపించాడు శ్రీధరాచార్యులు. గుడినిండా ఒకటే కోలహలంగా ఉంది.

 

ఇంతలో సుదర్శనుడు ఇంటి నుండీ తీసుకువచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి ఇష్టమని నైవేద్యంగా సమర్పిద్దామని తీసుకు వచ్చి స్వామివారికి సమర్పిస్తుండగా అది చూచిన శ్రీధరాచార్యులు నాయనా సుదర్శనా కాసిన్ని అటుకులు ఈ ఆకులో తీసుకెళ్ళి బృందావనం వద్ద బాల కృష్ణుడికి కూడా సమర్పించిరా నాయన అని చెప్పాడు. వెంటనే సుదర్శనుడు ఒక విస్తరాకులో దోసెడు అటుకులు పోసి బృందావనం దగ్గర బాలకృష్ణుడి పాదాల చెంత సమర్పించి తిను కృష్ణ తిను నీకు ఇష్టమని అటుకులు తెచ్చాను తిను అని ప్రాధేయపడ్డాడు. సుదర్శనుడు చూస్తుండగానే ఉన్నపళంగా విస్తరాకులో అటుకులన్నీ ఒకదాని వెనుక ఒకటి వరుసక్రమంలో చిన్ని కృష్ణుని పాదాల చెంతకు చేరి ఒకదాని పైకి ఒకటి ఎక్కుతూ కృష్ణుని పాదాలు తాకేటట్లు నిటారుగా నిలబడ్డాయి. ఈ సంఘటనను కళ్ళార్పకుండా చూస్తున్న సుదర్శనుడు హై... హై... కృష్ణుడు నాతో ఆటలాడుకుంటున్నాడని తెగ సంబరపడిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి తీసుకొచ్చి చూపించాడు, శ్రీధరాచార్యులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆహా ఏమిటీ విచిత్రం ఇన్నాళ్ళ నా అనుభవంలో ఎన్నడూ చూడలేదే ఆహా కృష్ణా అంతా నీ లీల వినోదం అని మనసులో అనుకొని ఆనాటి కార్యక్రమాలన్నీ ముగించుకుని తండ్రీకొడుకులు ఇల్లు చేరారు. శ్రీధరాచార్యులని మాత్రం ఈ సంఘటన ఆలోచింపజేసింది అతను ఇంతకు మునుపు పండగలకి ఎన్నో సార్లు అటుకులు సమర్పించినా ఏనాడు ఈ విధంగా జరగలేదు. ఈరోజేమిటి ఇంత విడ్డూరం ఏదో జరిగిందని ఆ ముకుందుడిని స్మరించుకుని కళ్ళుమూసుకున్నాడు...

 

శ్రీధరాచార్యులు స్వతహాగా ఆగమ, ఆయుర్వేద, జ్యోతిష్య శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నవాడు. వారి పూర్వీకుల నుండీ ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఈ ఆలయానికి ఆనాటి రాజుల కాలం నుండీ వీరి పూర్వీకులే అర్చకులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి విజయనగర రాజులు సమర్పించిన విశిష్టమైన సంపదలు ఇప్పటికీ ఆలయ నేల మాళిగలలో నిక్షిప్తమై ఉన్న సంగతి ఒక్క శ్రీధరాచార్యులకి మాత్రమే తెలుసు. ఎప్పుడైనా విపరీతమైన ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు రాజులు వాటిని తెరిపించి నియోగించేవారని, అవసరం తీరగానే యధాస్తానంలో పెట్టేవారని ప్రతీతి. ఎటువంటి పరిస్థితులలోనూ వాటిని మరే ఇతర కార్యక్రమాలకి వినియోగించరాదని రాజాజ్ఞగా అవి దిగ్భందించబడ్డాయని వారి పూర్వీకుల నుండీ తెలుసుకున్నాడు. అవి ఇప్పటికీ అలాగే చలామణీలో వున్నాయన్న సంగతి శ్రీధరాచార్యులకి తెలుసు అంతేకాకుండా అత్యవసర పరిస్థితులలో బృందావనం కింది భాగంలో ఉన్న భాండారాన్ని వాడేవారని మరలా అవసరం తీరగానే ఆ భాండారాన్ని యధాతధంగా పెట్టేవారని, బృందావనం కింది భాగం నుండీ సరాసరి నేలమాళిగలు చేరుటకు మెట్లున్నాయని శ్రీధరాచార్యుల తండ్రిగారు ఆలయ బాధ్యతను అప్పగిస్తున్నప్పుడు ఈ వివరాలన్నీ విశదపరిచారు.

 

అందుకే ఆరోజు బృందావనం కూలిపోయింది అనగానే శ్రీధరాచార్యులు అంతలా కంగారు పడిపోయాడు. ఈ విషయాలన్నీ ఆలయ ధర్మకత్తలకు తెలియదు. ఇప్పుడు ఇదేదో కొత్త చిక్కు వచ్చిపడిందే అని సతమతమయ్యాడు. శ్రీధరాచార్యులు అలా ఓ రెండు వారాలు గడిచిన తరువాత ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేవాదాయ శాఖ వారు వస్తున్నారని ఆలయ ధర్మకత్తలకు వర్తమానం అందింది. ఆ విషయాన్ని ఆచార్యులకి తెలియజేసి, వారికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నద్దమయ్యారు ధర్మకత్తలు. శ్రీధరాచార్యులుకు ఏమీ అంతుపట్టలేదు. ఈ విషయాలన్నీ వారికి తెలిస్తే ఏం జరుగుతుందోనని మధనపడ్డాడు. సరే నిండా మునిగినాక చలెందుకు గానీ ఎలా జరిగేది అలా జరుగుతుందని అనుకుని అంతా ఆ ముకుందుడి లీలని కుదుటపడ్డాడు.

 

దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించారు. ధర్మకత్తలతో సమావేశమై ఆలయం ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆలయ కార్యక్రమాలను ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న శ్రీధరాచార్యులను అభినందించారు. ఇంతలో ఓ అధికారి ఆలయమంతా కలియతిరిగి వస్తుండగా ఎవరో భక్తుడు బృందావనం వద్ద చిన్ని కృష్ణుడికి అటుకులు పెట్టడం గమనించాడు. అతను చూస్తుండగానే అటుకులు వరుసగా కదులుతూ నిటారుగా నిలబడి కృష్ణుని పాదాలను తాకడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని మిగతా అధికారులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో ఒక అధికారి ఇలాంటి సంఘటననే నేను నా స్నేహితుని వద్ద ప్రయోగశాలలో చూసానని అతను డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్త అని చెప్పాడు. అతను వెంటనే ఈ విషయాన్ని డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్తకి తెలియజేసాడు. ఈ విషయం తెలుసుకున్న అతను మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలసి మరుసటిరోజు ఉదయానికి హెలీకాప్టర్ లో వెంకటాపురం వేణుగోపాల స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఇవన్నీ ఆచార్యులు చూస్తుండగానే జరిగిపోయాయి. ఏంచేయాలో ఆచార్యులకి దిక్కుతోచలేదు. ఆలయానికి విచ్చేసిన శాస్త్రవేత్తలు ఆచార్యులని వివరాలడిగితే ఆచార్యులు ఇలా చెప్పుకొచ్చారు. ఓ నెలరోజుల క్రితం ఈ బృందావనంపై భారీ పిడుగుపడి బృందావనం ఒకవైపునకు ఒరిగిపోయింది అంతే అప్పటి నుండీ ఇలా జరుగుతుందని చెప్పారు. అయినా శాస్త్రవేత్తలకి ఆచార్యులు ఇంకా ఏదో దాస్తున్నారని అనిపించి మీకు మీ ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అని భరోసా ఇచ్చి నచ్చజెప్పి వివరాలు తెలిపితే మీరు దేశానికి సాయం చేసినవారవుతారని ఆచార్యులకు బోధపరిచారు.

 

ఆ మాటలకు సంతృప్తి చెందిన ఆచార్యులు ఇలా సెలవిచ్చారు అయ్యా ఈ బృందావనం విజయనగర రాజుల కాలం నాడు కట్టించినది దీని కింద ఆ రాజులు ఆలయానికి ఇచ్చిన వజ్రవైఢూర్యాలు రత్నాభరణాలు బంగారు నాణాలు రెండు రాగి బిందెలలో దిగ్భందించి భద్రపరిచారు. మొన్న పడిన పిడుగు ధాటికి ఆ బృందావనం కూలిపోతే మరమ్మత్తులు చేయించి పునః ప్రతిష్ట చేయించాము మీరు మళ్ళీ దానని పాడుచేయవద్దని ప్రాధేయపడ్డాడు. శాస్త్రవేత్తలకు మొత్తం విషయం అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు ఆచార్యులకు ఇలా చెప్పారు. స్వామి మరేం ఫరవాలేదు మీ సంపదకు వచ్చిన నష్టమేమీలేదు, బృందావనం కింద ఉన్న రాగి బిందెలు పిడుగుపాటుతో కాపర్ ఇరీడియంగా మారిపోయాయి అందువల్ల మేము ఆ బిందెలను మాత్రమే తీసుకుని మిగతా సంపదను యధాతధంగా భద్రపరిచేస్తాము అని అన్నారు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ఆచార్యులు కాపర్ ఇరీడియం అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది వివరాలు తెలపవలసినదిగా అడిగారు.

 

అందుకు ఒక శాస్త్రవేత్త ఇలా వివరించాడు స్వామీ మన పూర్వీకులనాటి రాగి చాలా స్వచ్ఛమైనది ప్రాచీనమైనది కదా. అది చాలా ఏళ్ళపాటు భూమిలోని ఉన్నందువల్ల భూగర్భంలో జరిగే అనేక రసాయనిక చర్యలకు లోనవుతుంది. అందువల్ల ఆ రాగి పిడుగులో ఉండే మొత్తం శక్తిని తనలో ఇముడ్చుకొనే విధంగా తయారవుతుంది. ఇలా తయారైన రాగి పాత్రలు గాని, నాణేలు గాని, పిడుగుపాటు కారణంగా కాపర్ ఇరీడియంగా మారడానికి అవకాశముంది. అయితే ఇక్కడ మీకొక సందేహం రావచ్చు రాగి మాత్రమే ఎందుకు ఇలా రూపాంతరం చెందుతుందని, మిగిలిన లోహాలతో పోల్చుకుంటే రాగి స్వతహాగా విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. మీరు గమనించినట్లైతే మనకు సాధారణంగా కరెంట్ తీగలలో రాగి తీగలనే ఎక్కువగా వాడతారు, కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక పిడుగులో 1000 జిగా వాట్స్(10^12) ల కన్నా ఎక్కువ విద్యుచ్ఛక్తి నిక్షిప్తమై ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఒక పిడుగులో ఉండే విద్యుచ్ఛక్తిని అమెరికా మొత్తానికి 20 నిముషాల పాటు కరెంటు ఇవ్వవచ్చు అంత శక్తి కలిగి ఉంటుంది. ఇంత శక్తిని ఒక్కసారిగా తనలోకి నిక్షిప్తం చేసుకునేటప్పటికీ భూగర్భంలో జరిగే కొన్ని రసాయనిక చర్యల కారణంగా అది కాపర్ ఇరీడియంగా రూపాంతరం చెందుతుంది. అది ఒక రోజులో కావచ్చు పది రోజులు కావచ్చు నెల రోజులు కావచ్చు ఇలా రూపాంతరం చెందిన కాపర్ ఇరీడియం కొన్ని విచిత్రమైన శక్తులను కలిగివుంటుంది. అందువల్ల దీనిని ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపే రాకెట్ లలో దీనిని ఇంధనంగా వాడతారని చెప్పుకొచ్చాడు.

 

అయితే అలా ఏర్పడిన కాపర్ ఇరీడియంను మనం తెలుసుకోవడం ఎలా అని ఆచార్యులు సూటిగా ప్రశ్నించారు శాస్త్రవేత్తల్ని, అందుకు శాస్త్రవేత్తలు స్వామీ అందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది రైస్ పుల్లింగ్ అంటే ఇప్పుడు మీరు చిన్ని కృష్ణుడికి పెట్టిన అటుకులు, అవి ఎలాగైతే ఒకదాని వెనుక ఒకటి ఆకర్షింపబడి ఒకదానిపైన ఒకటి నిటారుగా నిలబడ్డాయి కదా ఈ పద్దతి ద్వారా మనం అది కాపర్ ఇరీడియంగా గుర్తించవచ్చు. ఇంకా ఇలా ఏర్పడిన ఇరీడియం ఉన్న దగ్గర మరే ఇతర విద్యుచ్ఛక్తి పనిచేయదు, అని మరికొన్ని పద్దతులను వివరించాడు. శాస్త్రవేత్తలతో సమావేసానంతరం ఆచార్యులు ఆ ఇరీడియంను వెలికి తీయడానికి అంగీకరించాడు.

 

వెంటనే డి.ఆర్.డి.ఒ శాస్త్రవేత్తల బృందం ఆ కాపర్ ఇరీడియంను వెలికి తీయడానికి సన్నాహకాలు చేసుకున్నారు. అందుకు తగిన సామగ్రిని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండీ తెప్పించుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆలయంలో తవ్వకాలు మొదలుపెట్టి మధ్యాహ్నంకల్లా ఆ కాపర్ ఇరీడియం బిందెలను తీసి భద్రపరిచి అందులో ఉన్న భాండారాన్నంతా వేరే వాటిలోనికి మర్పించి యధాతధంగా ఆ బృందావనాన్ని పూడ్చిపెట్టారు. తరువాత శాస్త్రవేత్తలంతా భద్రపరిచిన కాపర్ ఇరీడియంను హెలీకాఫ్టర్లో తీసుకుని వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తరువాత ఈ కాపర్ ఇరీడియంకు తగిన మొత్తాన్ని ఆ ఆలయానికి సమర్పించి అందులో కొంత మొత్తాన్ని ఆచార్యులకి కూడా ఇచ్చారు. తనకు వచ్చిన సొమ్మును శ్రీధరాచార్యులు ఆలయానికి ఇచ్చి ఆలయ ధర్మకత్తలతో కలిసి ఆ సొమ్మును అనేక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ స్వామి వారి సేవలో తరించారు.

రచన

చంద్రమౌళి రెడ్లం

పలమనేరు

No comments:

Post a Comment